యాంటీ ఇన్కంబెన్సీ.. అధికార వ్యతిరేకత.. సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను వేధించే సమస్య ఇది. ఎంత బాగా పని చేసినా.. జనం అంచనాలను అందుకోలేకపోతే.. జనం మళ్లీ అధికారం ఇవ్వరు. ఒకసారి గెలిపించిన వారిని మరోసారి గెలిపించాలంటే అద్భుతమైన పాలన ఉంటేనే సాధ్యమవుతుంది. మరి అలాంటప్పుడు ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో అధికారం చేతికి చిక్కేలా పార్టీని గెలపించడం అంటే మామూలు విషయం కాదు.

 

తాజాగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ను మూడోసారి గెలిపించి ఈ ఫీట్ సుసాధ్యం చేశాడు. మరి ఇంతకు ముందు దేశంలో ఇలాంటి ఫీట్ ఎవరు చేసి చూపించారు.. హ్యాట్రిక్ సాధించిన సీఎంలు ఎవరు.. ఓసారి పరిశీలిద్దాం..? ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఫీట్ సాధించారు. 2001లో గుజ‌రాత్‌ సీఎంగా పగ్గాలు చేపట్టిన మోడీ.. 2002, 2007, 2012 ఎన్నిక‌ల్లో మ‌ణిన‌గ‌ర్ నుంచి పోటీచేసి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్లారు. సీఎంగా ఆయన గుజరాత్ ను ప్రగతి పథంలో నడిపాడు. హ్యట్రిక్ విజయాలతో సీఎంగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల తర్వాత ఏకంగా దేశ ప్రధాని అయ్యారు.

 

అంతకుముందు.. ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ కూడా కాంగ్రెస్ తరపున ఈ ఫీట్ సాధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన‌ ఏకైక మహిళగానూ ఆమె చరిత్ర సృష్టించారు . 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాలు పూర్తి కాలంపాటు సీఎంగా పనిచేశారు. 2013 ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ చేతిలో పరాజకీయం పాలయ్యారు.

 

ఇక బీజేపీ నాయకులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రమణ్ సింగ్ కూడా హ్యాట్రిక్ సీఎంల జాబితాలో ఉన్నారు. మ‌ధ్యప్రదేశ్‌కు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు సీఎంగా ప‌నిచేశారు శివరాజ్‌ చౌహాన్. 2005 నుంచి 2018 వ‌ర‌కు మ‌ధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప‌నిచేశారు. రమణ్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా మూడు పర్యాయాలు పనిచేశారు. 2003 నుంచి 2018 వరకు 15 ఏళ్ల పాటు పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా కొన‌సాగారు.

 

అలాగే త్రిపురలో మాణిక్‌ సర్కార్ వరుసగా నాలుగు సార్లు సీఎంగా పనిచేశారు. వీరికంటే ముందు జ‌్యోతిబ‌సు, ప‌వ‌న్‌కుమార్ చామ్లింగ్ , న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. జ్యోతిబ‌సు అయితే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా వరుసగా ఐదుసార్లు ప‌నిచేసి త‌న ప్రత్యేక‌త‌ నిలబెట్టుకున్నారు. 1977 నుంచి 2000 వరకు 23 ఏళ్లు సీఎంగా ఉన్నారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి: