ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 11 లక్షలమందిని చంపితే.. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ.. కానీ చరిత్ర పుటలు తిరగేస్తే ఇలాంటి అమానవీయ ఘటనలు కనిపిస్తాయి. అసలు ఈ భూమి మీద ఇంతటి దారుణాలు జరిగాయా అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతి క్రూరమైన నియంతగా పేరొందిన హిట్లర్ 11 లక్షల మంది యూదులు, ఇతర జాతీయులను చంపిన విధానం చరిత్రలో ఓ మాయని మచ్చగానే మిగిలిపోతుంది.

 

అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది. ఇన్ని లక్షల మందిని ఎందుకు చంపించాడు.. ఓసారి తెలుసుకుందాం. జర్మన్ దేశస్తుడైన హిట్లర్ కు యూదులంటే అసహ్యం.. ఈ భూమి మీద యూదులు లేకుండా చేయాలనుకున్నాడు.. యూరప్‌లోని యూదులతో పాటు నాజీ వ్యతిరేకమైన ఇతర జాతీయులను నిర్మూలించాలన్నది హిట్లర్‌ క్రూరమైన ఆలోచన. తన నియంతృత్వంతో యూరోప్‌లోని ఒక్కో దేశాన్ని ఆక్రమించినప్పుడు ఆయా దేశాల్లోని యూదులను ప్రత్యేక రైళ్లలో పోలండ్‌లోని ఆష్‌విజ్‌ అనే ప్రాంతానికి తీసుకెళ్లేవారు.

 

ఇక ఓ మృత్యు ఫ్యాక్టరీని నిర్మించారు. యూదులు, ఇతర జాతీయులను చంపేందుకు ప్రత్యేకంగా గ్యాస్‌ ఛాంబర్లను ఏర్పాటు చేశారు. ఈ గ్యాస్‌ ఛాంబర్లలోకి వేల మందిని పంపి విషవాయువులు వదిలేవారు. యూదులకు అనుమానం రాకుండా అంటురోగాలు రాకుండా పరీక్షలకు తీసుకొచ్చామని నమ్మించేవారు. ఈ గ్యాస్‌ ఛాంబర్లలోకి ఒక్కో తడవకు 2 వేలమంది వరకు పంపించేవారు. గ్యాస్ ఛాంబర్లలో విషవాయువులను వదిలేవారు.

 

అవి పీల్చిన వారు పది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయేవారు. ఇలా పోలండ్ లోని ఆష్ విజ్ మృత్యు కర్మాగారంలో దాదాపు 11 లక్షలమందిని చంపివేసినట్టు రికార్డులు ఉన్నాయి. ఇలా ఇన్ని లక్షల మందిని చంపించిన హిట్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. హిట్లర్ మరణం తర్వాత రష్యన్‌ సేనలు ఈ మృత్యు కర్మాగారాన్ని చేరుకుని బందీలను విముక్తి చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: