ఢిల్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వ్య‌క్తి రాఘ‌వ్ చ‌ద్దా.  చార్టెడ్‌ అకౌంటెంట్‌గా కెరీర్‌ ప్రారంభించి రాజకీయవేత్తగా ఎదిగిన చదా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజీంద‌ర్ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్‌ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో సోషల్‌మీడియాలో చాలా మంది యువతులు రాఘవ్‌ ను ఫాలో అవుతూ...తమను పెళ్లి చేసుకోవాలంటూ రాఘవ్‌ను కోరుతున్నారనే విష‌యం ఆయ‌న టీం బ‌య‌ట‌పెట్టింది. ఆ విష‌యాలను అలా ఉంచితే...తాజాగా ఆయ‌నుకు కేజ్రీవాల్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. 

 

ఇప్ప‌టికే రెండు ద‌ఫాలుగా సీఎంగా సేవలందించిన అరవింద్‌ కేజ్రీవాల్, తాజా గెలుపుతో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ మంత్రివర్గ కూర్పుపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. రాజీందర్ న‌గ‌ర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాఘవ్‌ చదాకు మంత్రిగా చాన్స్ ఇవ్వ‌నున్నార‌ట‌. ఆప్‌ అధికార ప్రతినిధిగా, పార్టీ లీగల్‌ అఫైర్స్‌ ఇంచార్జిగా రాఘవ్ కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన రాఘవ్‌ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెట్టనున్నట్లు సమాచారం. 2015లో ఆప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ సలహాదారుగా చదా పని చేశారు.

 

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రాఘవ్ చదా మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఉగ్రవాది అంటూ బీజేపీ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.  దీనిపై స్పందిస్తూ...... ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉగ్రవాది కాదని, నిజమైన దేశభక్తుడని ప్రజలు నిరూపించారని అన్నారు. కేజ్రీవాల్‌ యావత్‌ దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. కేజ్రీవాల్‌ చేస్తున్న పనులే ఆయన దేశభక్తిని చాటుతున్నాయి. బీజేపీ చూపుతున్నది దేశభక్తి కాదని రాఘవ్‌చదా ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: