అవును విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ప్రతిపక్షంలోని ఎంఎల్సీల నుండి జగన్మోహన్ రెడ్డికి బేరంతో కూడిన ప్రతిపాదన వచ్చిందట. అదేమిటంటే శాసనమండలి రద్దు తీర్మానంపై ఢిల్లీలో జగన్ ఎట్టి పరిస్ధితుల్లోను ఫాలో అప్ చేయకూడదని. అంటే రద్దు తీర్మానం ఢిల్లీలో కోల్డ్ స్టోరేజిలోనే ఉండిపోవాలనట. అందుకు బదులుగా టిడిపి నుండి పెద్ద ఎత్తున ఎంఎల్సీలు బయటకు వచ్చేసి చీలికవర్గంగా ఏర్పాటవుతారట.

 

ఇటువంటి ప్రచారమే మండలి రద్దు చేస్తారనే సమయంలో కూడా వచ్చింది.  పెద్ద సంఖ్యలో ఎంఎల్సీలు టిడిపిలో నుండి వైసిపిలోకి వచ్చేస్తారని లేకపోతే బిజెపిలో చేరిపోతారని ప్రచారం జరిగింది. అయితే మండలి రద్దు తీర్మానం తో ఆ ప్రచారమంతా తప్పని తేలిపోయింది. కానీ ఇపుడు ఓ ప్రయత్నం నిజంగానే ప్రతిపక్ష ఎంఎల్సీల నుండి మొదలైనట్లు సమాచారం. ప్రతిపక్ష ఎంఎల్సీలంటే స్వతంత్రులుగా గెలిచి తర్వాత పిడిఎఫ్ లో చేరినవారు లేండి.

 

వారంతట వారుగానే ఇటువంటి ప్రతిపాదనను జగన్ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కారణం ఏమిటంటే  తమ సభ్యత్వాలను కోల్పోవటం సభ్యుల్లో ఎవరికీ ఇష్టం లేదన్న విషయం అందరికి తెలిసిందే. అదే సమయంలో  మెజారిటి ఉంది కదాని తెలుగుదేశంపార్టీ అనుసరిస్తున్న విధానాలతో విసిగిపోయారట. మండలిని రద్దు చేస్తు ప్రభుత్వం చేసిన తీర్మానానికి టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడే ప్రధాన కారణమని చాలామంది మండిపోతున్నారని సమాచారం.  ఈ విషయంలో యనమలపై తమ అసంతృప్తిని టిడిపి సభ్యులు కూడా బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారట.

 

ఆ అసంతృప్తినే కొందరు టిడిపి సభ్యులు ఇండిపెండెంట్ సభ్యుల దగ్గర ప్రస్తావించారట. దాంతో టిడిపిలోని అసంతృప్త ఎంఎల్సీల మనోభావాలను జగన్ దృష్టికి తీసుకెళ్ళాలని ఇండిపెండెంట్ సభ్యులు రెడీ అయ్యారట. దాంతో  జగన్ నుండి సానుకూల స్పందన వస్తే టిడిపి నుండి బయటకు వచ్చేయటానికి చాలామంది సభ్యులు రెడీగా ఉన్నట్లు ప్రతిపాదన తెచ్చిన సభ్యులు అధికారపార్టీ ముఖ్యుల ముందుంచారట.  బుధవారం సాయంత్రం ప్రధానమంత్రితో జగన్ భేటి అవుతుండటంతో  ఎంఎల్సీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.  జగన్ నుండి ముందు సానుకూలత రావాలా ? లేకపోతే ముందు టిడిపి ఎంఎల్సీల నుండే చీలిక రావాలా ? అన్న విషయాన్నే తేల్చుకోలేకపోతున్నారు. మరి సాయంత్రంలోపు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: