పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. మార్చి మొదటివారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు అమిత్ షా, పవన్ కళ్యాణ్‌లను ఆహ్వానించాలనుకుంటోంది. 

 

ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా బీజేపీ, సంఘ పరివార క్షేత్రాలు కార్యక్రమాలు చేస్తున్నాయి. చిన్న చిన్న సభలు,  సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ సభలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా కొన్ని చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించింది బీజేపీ. మేధావుల సమావేశాలను ఏర్పాటు చేసింది. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో సభలు జరిగాయి. హైదరాబాద్‌లో కూడా కార్యక్రమాలు చేసింది. ఇందిరా పార్కులో ఒక కార్యక్రమం తప్ప ఎక్కువగా హాల్ మీటింగ్‌లకే పరిమితమైంది. 

 

మొక్కుబడి కార్యక్రమాలు కాకుండా భారీ బహిరంగసభ నిర్వహించాలని కమలనాథులు భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా టైం ఇస్తే మార్చి మూడో తేదీన ఈ సభ ఉండే అవకాశం ఉంది. ఈ సభకి బీజేపీతో మళ్లీ దోస్తు కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్టు సమాచారం.

 

త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం... గ్రేటర్ మునిసిపల్ కౌన్సిల్ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది... ఈ సభ అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు.

 

మొత్తానికి బీజేపీ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ వేస్తోంది. సీఏఏకు అనుకూలంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఏఏకు అనుకూల నిర్ణయానికి గల కారణాలను వివరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా అమిత్ షాతో పాటు, పవన్ కళ్యాణ్ లను ఈ మీటింగ్ కు అతిథులుగా ఆహ్వానిస్తోంది కమలం పార్టీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: