కర్నూలు జిల్లాలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్న నేపథ్యంలో ఈ పర్యటన పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే రాయలసీమ విద్యార్థి జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో పవన్ పర్యటన  ఏ విధంగా సాగుతుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. కర్నూల్ లో పవన్ రెండు రోజులపాటు పర్యటించేందుకు వీలుగా జనసేన నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేలా ఏర్పాట్లు చేసారు. 2017 లో జరిగిన ఓ విద్యార్థిని హత్య కేసులో ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరుతూ పవన్ ఆందోళన నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. 


 కర్నూలు లో హైకోర్టు రాకుండా పవన్ అడ్డుతగులుతూ రాయలసీమ అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. పవన్ కర్నూలు వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పవన్ రాయలసీమ అభివృద్ధికి పాటుపడాలని, లేకుంటే ఆయన పర్యటనను అడ్డుకుంటామని వారు చెబుతున్నారు. జనసేన నాయకులు మాత్రం ఈ ప్రకటనపై మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు వస్తున్న పవన్ ను అడ్డుకోవడం తగదని వారు సూచిస్తున్నారు. పవన్ మూడు రకాలుగా మాట్లాడుతున్నారని, సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని పవన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని విద్యార్థి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. 


కేసు నిందితులను శిక్షించాలని మొదటి నుంచి తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే విద్యార్థులను వైసిపి నాయకులే కావాలని రెచ్చగొట్టి విమర్శలు చేస్తున్నారని, రాయలసీమ విద్యార్థి జేఏసీ వెనుక అధికార పార్టీ ఉందని జనసేన నాయకులు మండిపడుతున్నారు. రాయలసీమలో పవన్ పర్యటిస్తే తమకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఈ విధంగా వారిని ముందు పెట్టి ఇలా ఆందోళనలు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ పర్యటన ప్రారంభం కాబోతుండడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: