అనుమానం పెనుభూతమైంది. అనారోగ్యంతో రుయాకు వెళ్లిన వృద్ధుడు, మాస్క్ వేసుకోవాలని వైద్యసిబ్బంది సూచించడంతో ఆందోళన చెందాడు. తనకు కరోనా వైరస్ సోకిందని.. ఇతరులెవరికీ అది అంటుకోకూడదని భావించాడు. చెట్టుకి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ విషాదం.. స్థానికంగా కలకలం రేపింది.

 

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. చైనాలో వేయిమందికి పైగా పౌరులను బలితీసుకున్న ఈ మహమ్మారి... మరికొన్ని వేలమందిని ఆస్పత్రుల్లోకి నెట్టింది. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌పై పోస్టుల్ని చూస్తే.. జనంలో బీపీ పెరిగిపోతోంది. చిన్నపాటి జలుబు, దగ్గు వచ్చినా, కరోనా ఏమో అన్న భయం వెన్నాడుతోంది. గ్రామాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో.. సమస్య జఠిలంగా మారుతోంది. తనకు కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.


 
శ్రీకాళహస్తి నియోజకవర్గo  తొట్టంబేడు మండలం.. శేషమనాయుడుకండ్రిగకు చెందిన 50ఏళ్ళ బాలకృష్ణ.. గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రుయాకు వెళ్లాడు. పరీక్షల తర్వాత సాధారణ వైరల్ ఫీవర్ అని  డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చి తనకు కరోనా వైరస్‌ సోకిందని, తనను ముట్టుకోవద్దని కుటుంబ సభ్యులతో చెప్పాడు. దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి తరిమి, ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. సోమవారం తెల్లవారుజామున ఇంటినుంచి బయటికొచ్చిన బాలకృష్ణ.. పొలానికి వెళ్లి తల్లి  సమాధి దగ్గరే ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బాలకృష్ణ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అవగాహన లోపంతో భయపడి బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబం వాపోతోంది. 

 

బాలకృష్ణకు అనారోగ్యసమస్యలు ఉన్నాయని వైద్యసిబ్బంది చెబుతున్నారు. వైరల్ ఫీవర్ వల్ల నోటిలో పుండు ఏర్పడిందని, మాస్క్ వేసుకుని.. మాట్లాడాలని సూచిస్తే.. కరోనా అనుకుని ప్రాణాలు తీసుకున్నాడని వైద్యసిబ్బంది తెలిపారు. ప్రభుత్వం కరోనా వైరస్‌పై ..  గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. బాలకృష్ణ తరహాలో ఇంకెవరూ చనిపోకుండా చూడాలంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: