పెనుగంగపై ఇసుకాసురులు కన్నేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. అధికారం అండతో అందిన కాడికి దోచుకుంటున్నారు. మామూళ్లమత్తులో జోగుతున్న అధికారులు.. అక్రమరవాణను చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. 

 

ఆదిలాబాద్‌ జిల్లాలో ఇసుక అక్రమరవాణ జోరుగా సాగుతోంది. జిల్లాలోని వాగువంకలతో పాటు పెనుగంగను ఇసుకాసురులు తోడేస్తున్నారు.  అధికార పార్టీ నేతలఅండతో చెలరేగిపోతున్నారు. ప్రధానంగా పెనుగంగ పరివాహక ప్రాంతాల్లో రోజు వందల ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు.

 

జైనాథ్ ,బేలా,భీంపూర్ మండలాల్లో.. ఇసుక అక్రమరవాణ పెద్దఎత్తున కొనసాగుతోంది. ప్రధానంగా మహరాష్ట్ర సరిహద్దు పెనుగంగ పరివాహక ప్రాంతాల్లో... ఇసుక అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు ఆరు లారీలుగా సాగుతోంది. బేల మండలంలోని సాంగిడీ లో రోజూ 200 నుంచి  300 ట్రాక్టర్లు ఇసుక రవాణ జరుగుతోంది. బెదొడ, మనియార్ పూర్ లతో పాటు జైనాథ్ మండలంలోని పెండల్ వాడ,ఆనంద్ పూర్‌లలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది.అధికార పార్టీకి చెందిన నాయకుడే గంగ ఒడ్డున ఇసుక డంప్  చేసుకొని.. అక్రమ రవాణా సాగిస్తున్నారు. భీంపూర్ మండలంలోనూ ఇసుక  అక్రమరవాణా సాగుతోంది. రోడ్లు పాడవ్వడంతో పాటు రాత్రిళ్లు ట్రాక్టర్ల మోతతో నిద్రలేకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభంలేకుండా పోతుందంటున్నారు గ్రామస్థులు. 

 

కొందరు ప్రభుత్వ అభివృద్ది పథకాల పేరు చెప్పి ఇసుక తరలిస్తుంటే... ఇంకొందరు ఇదే ఆదాయవనరుగా మార్చుకుని అక్రమంగా ఇసుక తరలిస్తూ, సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ ,మైనింగ్ శాఖతోపాటు వివిధ డిపార్మెంట్ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశామంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు. అధికారులు మాత్రం ఇల్లీగల్‌ ఇసుక దందా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పెనుగంగలో ఇసుక తోడడానికి ఎవ్వరికి అనుమతివ్వలేదంటన్న ఆర్డీఓ చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందే ట్రాక్టర్ యజమానులు, వ్యాపారులకు సమాచారమిచ్చి, ఆ తర్వాత అధికారులు బయలుదేరుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు కొత్త కలెక్టర్ చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: