ఏపీలో నకిలీ పురుగు మందులు మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్లను లోకల్ గా తయారు చేసి, రైతులను నట్టేట ముంచే దందా గుంటూరు కేంద్రంగా సాగిపోతోంది. నకిలీ పురుగు మందులపై అధికారులు తో పాటుగా పాలకులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రయోజనం మాత్రం కనిపించటం లేదు.

 

నకిలీ.. ఈ పేరు చెబితేనే గుర్తుకు వచ్చేది గుంటూరు.. ఇటీవల కాలంలో దందాలు తగ్గు ముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో మరో సారి నకిలీ పురుగు మందుల వ్యవహరం తలనొప్పిగా మారింది. నరసరావు పేట కేంద్రంగా నకిలీ పురుగు మందులను తయారు చేసి,  రైతులను మోసగించే ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తో పాటుగా వ్యవసాయ శాఖ అదికారులు రెండు రోజుల పాటు తనిఖీలు చేసి నకిలీల వ్యవహరాన్ని బయటకు తెచ్చారంటే ఏ స్థాయిలో ఘరానా మోసం జరుగుతుందో అర్దం అవుతుంది.

 

విష్ణు ప్రియాంక రైతు సేవా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. రికార్డుల పరీశీలన చేశారు. రికార్డులకు స్టాకుకు సంబంధం లేదని గుర్తించారు. లక్షల రూపాయలు విలువైన పురుగుల మందులను స్వాధీనం చేసుకున్నారు. బరంపేటలో కూడ బయో ప్రాడక్ట్స్ తయారు చేసే గోడౌన్ పై దాడులు నిర్వహించారు. గడవు ముగిసిన ఉత్పత్తులను గుర్తించారు.అంతే కాదు అసలు అనుమతులు లేకుండా నడుపుతున్నారని నిర్దారణ కావటంతో వెంటనే సీజ్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు విజిలెన్స్ ఎస్పీ నోట్ పెట్టారు.


 
గుంటూరు కేంద్రంగా ఇప్పటికే అనేక ప్రాంతాలకు నకిలీ పురుగు మందులు ఎగుమతులు కూడ అయ్యాయనే ప్రచారం జరుగుతుంది.రెండ్రోజుల పాటు అధికారులు దాడులు చేసి భారీ ఎత్తున నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకోవటం కూడా సంచలనంగా మారింది.ప్రభుత్వం మారటంతో నకిలీ తయారీ దారులు కాస్త వెనక్కి తగ్గినప్పటికి,  మరోసారి ఈ వ్యవహరం బయటకు రావటంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే అధికారుల దాడులతో దాదాపుగా అన్ని దుకాణాలు కూడా క్లోజ్ చేసి వ్యాపారులు జారుకుంటున్నారు. నకిలీల భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన అధికారులు జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. అసలు విషయాలు బయటకురానీయకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతో అధికారులపై వత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: