ఏపీ సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కొద్దిసేపటి క్రితం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ విషయంలో కేంద్రం సానుకూల దృక్పథంతో ఉండాలని, ఏపీకి అవసరమైన నిధులు కేటాయింపు చేయాలని తదితర విషయాలపై జగన్ ప్రస్తావించగా దానికి మోడీ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు గంటన్నర సేపు జరిగిన ఈ చర్చల్లో ప్రధానంగా ఏపీ, తెలంగాణ విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను యధావిధిగా అమలు చేయాలని, నిధుల సమస్య తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీని ఆదుకోవాలని జగన్ ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.


 ఇటీవల ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, అది ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉండడంతో  దానిపైన సానుకూలంగా స్పందించాలని జగన్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అలాగే దీంతో పాటుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళుతుందని కానీ నిధుల కొరత తీవ్రంగా ఉందని, ప్రత్యేక హోదా ఇస్తే ఏపీకి మరింత మేలు చేసినట్టు అవుతుందని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విభజన హామీలు, మండలి రద్దు పైన అలాగే పోలవరం విషయంలోనూ వైసీపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని, నిధులు కేటాయింపు కూడా చేస్తామని, తాను అన్ని విషయాల్లోనూ మీకు అండగా ఉంటానని మోదీ జగన్ కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


 కాకపోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాత్రం మోదీ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. ప్రత్యేక హోదా ఇస్తే దేశవ్యాప్తంగా ఈ డిమాండ్లు పెరుగుతాయని, అది రాజకీయంగా బిజెపి ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది అని మోదీ జగన్ కు సూచించినట్లు సమాచారం. వీటితో పాటు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం, జనసేన తదితర పార్టీల విషయమై మోదీ జగన్ కు అనేక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సుమారు గంటన్నర సేపు చర్చలు జరిగాయి. వీటితో పాటు అనేక అంశాల గురించి క్షుణ్ణంగా మోదీ జగన్ చర్చించుకున్నారు. మొత్తంగా ప్రధాని మోదీ జగన్ పర్యటన సక్సెస్ ఫుల్ గా ముగిసినట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: