ఆయన ఒకప్పుడు... చీటికి మాటికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవారు. అందుబాటులో ఉన్నవారితో సమావేశమయ్యేవారు. కానీ ఈ మధ్య రాష్ట్రానికి రావడమే మానేశారు. వరుస పరాజయాలతో ఉన్న కాంగ్రెస్‌ నేతలకు నైతిక బలం ఇవ్వాల్సిన రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జి కుంతియా గాంధీభవన్‌కు ఎందుకు రావడంలేదు? దీనిపై పార్టీ నేతలేమనుకుంటున్నారు?

 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా... చాలా రోజులుగా కనిపించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన ఆయన కొంతకాలంగా గాంధీ భవన్‌లో కనిపించటం మానేశారు. ఢిల్లీకే పరిమితం అయ్యారో..? లేదంటే... తెలంగాణలో ఏముందిలే అనుకున్నారో ఏమో తెలియదు కానీ... కుంతియా చాలాకాలంగా రాష్ట్రంలో కనిపించటం లేదు. గడిచిన ఆరు నెలల క్రితంవరకు... వారంలో రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండే వారు. అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో సమవేశమయ్యేవారు. ఏఐసీసీ కార్యాచరణ ఇచ్చిందంటే.. ఆయన హోటల్లో ఉండి సమీక్షలు చేసేవారు. కానీ  కొంతకాలంగా కనిపించటం మానేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో యమ బిజీగా కనపించిన ఆయన... ఇప్పుడు అసలు కనిపించకపోవడంతో కుంతియా ఎక్కడా..? అనే కామెంట్లు గాంధీ భవన్‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

 

ఇటీవల తెలంగాణలో మున్పిపల్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్ధాయిలో ఫర్మామెన్స్ చేయలేకపోయింది. 18 మున్పిపాలిటీల్లో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ వాటిని కైవసం చేసుకోలేకపోయింది. ఫలితాలపై సమీక్ష నిర్వహించాల్సిన కుంతియా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. రాష్ట్రంలో కీలకమైన నాయకులంతా తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోయారు. కానీ వీటిని విశ్లేషించేవారే లేకుండాపోయారు. సాధారణంగా..రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఇలాంటి సమీక్షలు చేస్తుంటారు. కానీ కుంతియానే కనిపించకపోవటంతో.. సమీక్షలు కూడా అటకెక్కాయి.
 


సమీక్షల సంగతి ఎలా ఉన్నా... కుంతియా కనిపించకపోవటంతో.. అది కాస్త వేరే చర్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ జరుగుతుంది. సీడబ్ల్యూసీ సమావేశం తరువాత దేశవ్యాప్తంగా నాయకత్వ మార్పు ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు.. ఏఐసీసీలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతుంది. కుంతియా కొంత కాలంగా రాకపోవటంతో.. ఆయన్ని కూడా మార్చుతారేమోననే టాక్‌ మెదలైంది. నాయకత్వ మార్పుపై ఎప్పటికప్పుడు అంతో ఇంతో స్పష్టత ఇచ్చే కుంతియానే ఇప్పుడు కనిపించకపోవడంతో... పార్టీలో పరిణమాలపై చర్చలు తీవ్రమయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: