బడ్జెట్ సమావేశాల అనంతరం  విశాఖ నుంచి పరిపాలనా కొనసాగించేందుకు అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటుందా ? అంటే అవుననే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పకనే చెబుతున్నారు . అయితే మూడు రాజధానుల అంశం పై అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించడంతో ,  వీలైనంత త్వరగా విశాఖ నుంచి పరిపాలన చేపట్టాలని భావించిన అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది .

 

దీనితో  విశాఖ నుంచి ఇప్పుడప్పుడే పరిపాలన చేయడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతుంటే , మంత్రులు మాత్రం అదేమీ లేదని మార్చి లో బడ్జెట్ సమావేశాల అనంతరం ఎప్పుడైన విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు . మూడు రాజధానుల ఏర్పాటు ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే . అయినా అధికార పార్టీ  ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు . ఇప్పటికే విశాఖ నుంచి పరిపాలన చేపట్టడానికి అవసరమైన సన్నాహాలను చేస్తోంది .

 

పరిపాలనకు సంబంధించి కొన్ని శాఖలను విశాఖకు తరలించేందుకు వీలుగా ఇప్పటికే అధికారికంగా జీవో కూడా జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం , హైకోర్టు వద్దని చెప్పిన వినకుండా కార్యాలయాల తరలింపుకు కూడా రెడీ అయిపొయింది  . ఇక పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను మండలిలో అడ్డుకోవడం ద్వారా , మూడు రాజధానుల ఏర్పాటును తాత్కాలికంగానైనా  అడ్డుకోవాలని   ప్రధాన ప్రతిపక్షం టీడీపీ   ఎత్తుగడ వేసింది . దానిలో  భాగంగానే   మండలి చైర్మన్ షరీఫ్ తన విచక్షణ అధికారాన్ని వినియోగించి , ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారన్న ఆరోపణలు విన్పించాయి .

 

అయితే ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు . అందుకే బడ్జెట్ సమావేశాల అనంతరం విశాఖ నుంచి పరిపాలన కార్యక్రమాలను సీఎం చక్కబెట్టనున్నారని మంత్రులు చెబుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: