ఏపీ సర్కారు విద్యారంగంపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మ ఒడి పేరుతో ప్రతి తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయలు అందజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. నాడు- నేడు పథకం ద్వారా నిర్ణీత సమయంలో పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ లోనూ భారీగా నిధులు కేటాయించారు.



అంతే కాదు.. ఈ నాడు- నాడు పథకంలోకి డిగ్రీ కాలేజీలను కూడా తీసుకురావాలని జగన్ సర్కారు ఇటీవల నిర్ణయించింది కూడా. ఇక ఇప్పుడు.. జగన్ సర్కారు మరో గుడ్ న్యూస్ చెబుతోంది. జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి ఓ కిట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కిట్‌లో పుస్తకాలు, నోట్‌బుక్స్, మూడు జతల యూనిఫాం, బెల్టు, షూస్‌ సుమారు రూ. 13 వందల నుంచి 15 వందలు విలువ చేసే కిట్‌ను ఇవ్వనున్నారు.



ఈ విషయాన్ని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట ఇస్తే దాని కోసం ఎందాకైనా వెళ్తారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. కీ రిసోర్స్‌ పర్సన్స్‌ని 30 మందిని ట్రైన్‌ చేసుకొని వారి ద్వారా ప్రతి జిల్లాకు 20 మందిని మొత్తం 260 మందికి వారం రోజులు తర్ఫీదు ఇవ్వనున్నారు.



అంతే కాదు.. మండలం నుంచి నలుగురును తీసుకొని సుమారు 2700 మందికి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దఫాలుగా టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 67,145 మందికి రెండు దఫాలుగా తర్ఫీదు ఇవ్వడం జరిగిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఇక.. ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించిన తల్లిదండ్రులకు, పేరంట్స్‌ కమిటీలకు మంత్రి సురేష్‌ ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: