రాజధాని తరలింపుపై ఏపీ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజిలెన్, జీఏడీ, కార్యాలయాల తరలింపు లాంటి అంశాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు వ్యక్తులను ఉద్దేశించి దాఖలు చేసిన పిటిషన్లపై పిటిషన్‌దారుల వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంపై సీఎం జగన్‌కు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది.. 

 

రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. కర్నూలుకు విజిలెన్స్ కమిషన్ కార్యాలయం తరలింపు, విశాఖలో మిలీనియం టవర్ కు నిధులు కేటాయింపు అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. విజిలెన్స్ కమిషన్, జీఎడీ రెండూ ఎలా వేర్వేరో వివరిస్తూ వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.విజిలెన్స్ హెడ్ ఆఫీస్ ఒక చోట ఉంటే మిగతా స్టాఫ్ మరో చోట ఉంటే విధులు నిర్వహిస్తారో తెలియజేయాలని కోరింది. అంతేకాక.. ప్రస్తుత సచివాలయంలో ఎంత మంది స్టాఫ్ పని చేస్తున్నారు? వారికి.. ఎంత స్థలం ఉందో తెలిపుతూ ఆఫిడఫిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఇక్కడ స్థలం సరిపోకపోతే.. ఇక్కడే వేరే భవనంలోకి మార్చకుండా వేరే ప్రాంతానికి ఎందుకు మార్చుతున్నారో కూడా తెలియజేయాలని స్పష్టంచేసింది.

 

మరోవైపు పిటిషన్ దారుల వైఖరిని త్రిసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి సహా అజేయ కల్లం, సజ్జల తదితరులు కామెంట్లు చేశారని, వారికి నోటీసులు జారీ చేసి విచారించాలంటూ పిటిషనర్లు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటిని హైకోర్టు తోసిపుచ్చింది. ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. వ్యక్తులను ఉద్దేశించి దాఖలు చేసిన అంశాలపై విచారించేందుకు కోర్టులు లేవని స్పష్టం చేసింది. అలాచేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దుర్వినియోగంచేసినట్టేనని అభిప్రాయపడింది.

 

రాజధాని తరలింపుతో పాటు సలహదారుల కామెంట్ల పిటిషన్లను కూడా కలిపి విచారించాలన్న పిటిషన్ దారుల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. న్యాయవ్యవస్థ హుందాతనం  ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని అభిప్రాయపడింది. ఎవరేం మాట్లాడుతున్నారో తమ దగ్గర సమాచారముందని స్పష్టం చేసింది. అధికారుల రూల్స్ ఉల్లంఘన, సలహాదారుల వ్యాఖ్యలకు సంబంధించి న్యాయవాదులు వేసిన ఇంటర్మ్ అప్లికేషన్లు ధర్మాసనం తొలగించింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: