టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయి దాదాపు 8 నెలలు దాటేసింది. ఆయన ప్రతిపక్ష నేతగా మళ్ళీ పాత్ర తీసుకుని రాజకీయాలు చేస్తూ వెళుతున్నారు. అయితే మునుపు వైఎస్సార్ సమయంలో కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బాబు...కాస్త ఆచి తూచి ప్రభుత్వ విధానాలపై స్పందించేవారు. కానీ జగన్ సీఎం అవ్వగానే, బాబుకు ఎక్కడ లేని అసూయ వచ్చేసిందేమో గానీ, వెంటనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు ప్రభుత్వ విధివిధానాలు బాగున్నాయా? లేవా? అని చర్చలు కూడా చేయకుండా ఏకపక్షంగా ఏకీపారేయడమే పనిగా పెట్టుకున్నారు.

 

అయితే బాబు ఎన్ని చేస్తున్న ప్రజలు మాత్రం పట్టించుకునే స్థితిలో లేకుండా పోయారు. ఇసుక దీక్షలు, ఛలో ఆత్మకూరులు, అన్నా క్యాంటీన్ రద్దుపై రోడ్లు ఎక్కడం ఇలా చెప్పుకుంటూ పోతే ఏ విషయంలోనూ బాబుకు మైలేజ్ రాలేదు. ఇక గత రెండు నెలలుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమం చేస్తూ రోడ్లెక్కి మరి హడావిడి చేస్తున్నారు. ఇలా అమరావతి ఉద్యమం చేసిన జనాలు బాబుని పట్టించుకున్న దాఖలాలు కనపడలేదు.

 

ఏదో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాస్త స్పందన వచ్చింది తప్ప, మిగిలిన ప్రాంతాల్లో బాబుకు సొంత పార్టీ నుంచే స్పందన కరువైంది. ఇక ఇలాంటి పరిస్తితుల్లో బాబు అసలు విషయం తెలుసుకున్నారు. అమరావతినే పట్టుకుని కూర్చుంటే ఇతర ప్రాంతాల్లో పని అవ్వదు అని అర్ధం చేసుకున్నారు. అందుకే అమరావతి ఉద్యమాన్ని వదిలేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్య యాత్రతో తిరగడానికి సిద్ధమయ్యారు.

 

కేవలం అమరావతి విషయమే కాకుండా రేషన్‌ కార్డు, పింఛన్ల తొలగింపు, ఇసుక ధర పెంపుతో పాటు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ప్రజలకు వివరించడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 17 నుంచి మొత్తం 45 రోజులపాటు రాష్ట్రం మొత్తం పర్యటించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ విధంగా బాబు అమరావతినే పట్టుకుని వేలాడకుండా మిగతా సమస్యలని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. మరి చూడాలి ఈసారైనా జనం బాబుని  పట్టించుకుంటారో? లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: