అధికారం కోసం ఆశ పడితే అసలుకే మోసం వస్తుందనే విషయం...2014 తర్వాత వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పరిస్తితి చూస్తే అర్ధమైపోతుంది. 2014లో వైసీపీ తరుపున గెలిచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికలకొచ్చేసరికి వారిలో ఒక్కరు మాత్రమే విజయాన్ని అందుకున్నారు. మిగిలిన వారంతా చావుదెబ్బ తిన్నారు. అయితే చావుదెబ్బ తిన్నాక కొందరిలో జ్ఞానోదయం అయినట్లు తెలుస్తోంది. వారు ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇటు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

ముఖ్యంగా వైసీపీలో గెలిచి, టీడీపీ కండువా కప్పుకుని మంత్రులైన వారు మళ్ళీ సొంతగూటికి చేరేందుకు సన్నిహితుల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో వైసీపీ తరుపున పలమనేరు నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి, ఆళ్ళగడ్డ నుంచి గెలిచిన భూమా అఖిలప్రియ, జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి, బొబ్బిలి నుంచి గెలిచిన సుజయ కృష్ణరంగరావులు టీడీపీలోకి వెళ్ళి మంత్రులైన విషయం తెలిసిందే.

 

అయితే మంత్రులుగా పని చేసిన ఈ నలుగురు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా ఏం ఉండటలేదు. ఇక వీరిలో ఆదినారాయణరెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆదినారాయణని పక్కనబెట్టేస్తే మిగిలిన ముగ్గురులో సుజయ కృష్ణ అసలు పార్టీలో కనపడటం లేదు. ఆయన అవకాశం దొరికితే వైసీపీలో చేరేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

అటు భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డిలు పార్టీలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఏదో కొన్ని రోజులు కనిపించి, మిగిలిన రోజులు అడ్రెస్ ఉండటం లేదు. అయితే వీరికి కూడా టీడీపీలో ఉండటం కష్టంగానే ఉందని తెలుస్తోంది. వీలుని బట్టి వైసీపీలో ఉన్న సన్నిహితుల ద్వారా జగన్‌ చెంతకు చేరాలని చూస్తున్నట్లు సమాచారం. కాకపోతే జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. మరి చూడాలి ఈ మాజీ మంత్రులు సొంతగూటికి ఎప్పుడు చేరుకుంటారో? 

మరింత సమాచారం తెలుసుకోండి: