ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలు గెలుచుకున్న ఆప్‌.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఆప్ విజ‌యాల‌ను అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ర్షించింది.  ఇవాళ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్‌ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మ‌రోవైపు, ఈ స‌మావేశం నేప‌థ్యంలో కీల‌క అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల్లో 50 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయట. సీఎంతో పాటే మంత్రులు కూడా ప్రమాణం చేయ‌నున్నారు.

 

అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌  (ఏడీఆర్‌) జరిపిన  అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం 37 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యాచారం, హత్యాయత్నం, మహిళల పట్ల నేరాలు నమోదు కావడం గమనార్హం. 37 మందిలో 13 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలు నమోదవగా.. వీరిలో ఒకరిపై అత్యాచార కేసు రిజిస్టర్‌ అయిందట. మరో 24 మంది ఎమ్మెల్యేలపై పలు రకాల క్రిమినల్‌ కేసులో నమోదయ్యాయి. అంతేకాదు 45 ఆప్‌ ఎమ్మెల్యేలు, ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ఏడీఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. 

 

 

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్‌ పార్టీ నేతగా అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం, మాజీ ఉపముఖ్యమంత్రి మానిష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటే కేబినెట్‌ మంత్రులంతా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 16, ఆదివారం ఉదయం 10 గంటలకు కేజ్రీ.. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ ప్రజల సాక్షిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు.

 


కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన నేప‌థ్యంలో,  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. దీంతో, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జెనరల్‌ సెక్రటరీలతో ఎన్నికలకు సంబంధించి రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. తదనంతరం, ఢిల్లీలో పార్టీ పటిష్టతకు చేపట్టబోయే విధివిధానాలను రూపొందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: