రాయలసీమపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేక ఫోక‌స్‌తో ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టిస్తున్న జనసేన అధ్యక్షుడు దీనికి కొన‌సాగింపుగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఎకరాకు నీరు అందించడంతోపాటు తాగు నీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యలేమిటి... పాలకులు చేస్తున్నదేమిటి అనే విషయాలపై జనసేన సమగ్రంగా అధ్యయనం చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాయలసీమలోని జల వనరులు, ఇక్కడి సాగు నీటి ప్రాజెక్టులపై జిల్లాలవారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. 

 


కర్నూలులో రాయలసీమ నాయకులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో సీమ ప్రాజెక్టులపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించారు. రాయలసీమ కోసం ఎన్నో ప్రాజెక్టులను చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదనీ... ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహించడం లేదని... నిర్మాణ దశలో ఉన్నవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉందని పార్టీ నాయకులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దృష్టికి తీసుకు వచ్చారు.  ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “వర్షాలు బాగా కురిసినా చెరువులు నింపలేకపోయారు. ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వలసలు ఆగడం లేదు. సాగుబడికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి జల వనరులు, ప్రాజెక్టులపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిద్దాం. ఈ సమావేశాల్లో జల వనరుల నిపుణులు, రైతు ప్రతినిధులు, ఇక్కడి రైతుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు, రాయలసీమ అభివృద్ధిని కోరుకొంటూ పని చేసేవారిని భాగస్వాములను చేద్దాం. ఈ జిల్లాల్లో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం, ప్రతి ఇంటికీ తాగు నీటిని అందించడం అవసరం. సీమ సౌభాగ్యమే లక్ష్యంగా జనసేన పని చేస్తుంది” అన్నారు. 

 

రాయలసీమలో జల వనరుల నిర్వహణ, ప్రాజెక్టుల పని తీరు, వ్యవసాయాభివృద్ధి, రైతులకు లబ్ధి చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని నాయకులను ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆదేశించారు. ప‌వ‌న్ ఈ ర‌కంగా తీసుకున్న స‌ల‌హాల అనంత‌రం సీమ కోసం మ‌రో ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: