దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల చేతిలో చిత్తయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వం , ఇప్పుడు  ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు రెడీ అవుతోందా ?, అందుకే ఇన్నాళ్లు వివిధ కారణాలతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కి  అపాయింట్ మెంట్ ఇవ్వకుండా దాటవేత ధోరణి తో వ్యవహరించిన ప్రధాని మోడీ , ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అపాయింట్ మెంట్ ఇచ్చారా ?? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే ప్రచారం జరుగుతోంది . ఉత్తరాది లో బలంగా ఉన్న బీజేపీ , దక్షిణాదిలో పాగా వేయాలని మొదటి నుంచి ప్లాన్ చేస్తోంది .

 

అయితే దక్షిణాది లో పాగా వేయడానికి ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎప్పటికప్పుడు బెడిసికొడుతూనే ఉన్నాయి . ఉత్తరాది లో బలంగా ఉన్నామని భావిస్తున్న చోటే , సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు రాష్ట్రాలు చేజారిపోవడంతో బీజేపీ నాయకత్వం ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది . ఉత్తరాది తో పాటు , దక్షిణాది లోను బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లకపోతే , రానున్న రోజుల్లో ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంటుందని ఆ పార్టీ నాయకత్వం  గ్రహించినట్లు సమాచారం . ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తో , తమిళనాడు లో ప్రతిపక్ష డీఎంకే తో జట్టు కట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్లు హస్తిన వర్గాలు చెబుతున్నాయి .

 

అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు , జగన్ కు ప్రధాని  అపాయింట్ మెంట్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది . దానికితోడు త్వరలోనే మంత్రి విస్తరణ చేపట్టనున్న మోడీ , తన కేబినెట్ లో చేరాల్సిందిగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ను కోరే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: