తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బస్తీ దవాఖానా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. బస్తీ దవాఖానా పథకానికి మంచి గుర్తింపు వస్తూ ఉండటంతో మంత్రి కేటీఆర్ జీ.హెచ్.ఎం.సీ పరిధిలో మరో 227 బస్తీ దవాఖానాలకు ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం బస్తీ దవాఖానాలను మంజూరు చేసిందని బస్తీ దవాఖానాల సంఖ్య పెరగనుందని కేటీఆర్ చెప్పారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ లోని జీ.హెచ్.ఎం.సీ పరిధిలో 123 బస్తీ దవాఖానాలు పని చేస్తుండగా తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం 227 దవాఖానాలను మంజూరు చేయటంతో వీటి సంఖ్య 350కు పెరగనుంది. మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాబోయే మూడు నెలలలో 227 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. హైదరాబాద్ జీ.హెచ్.ఎం.సీ పరిధిలో బస్తీ దవాఖానాలు విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. 
 
ప్రభుత్వం బస్తీ దవాఖానాలలో సేవలందించడానికి కొన్ని రోజుల క్రితం 1050 పోస్టులను కూడా మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ఒక్కో బస్తీ దవాఖానాలో ఒక వైద్యుడు, ఒక నర్సు, సహాయక సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీలుగా పంపించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయటం కోసం ప్రభుత్వం బస్తీ దవాఖానాలకు ఏర్పాటు చేసింది. 
 
ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం వలన ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ బస్తీ దవాఖానాలలోనే ప్రజలకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. బస్తీ దవాఖానాల్లో ప్రాథమికంగా 10 రకాల వైద్య సేవలు అందుతున్నాయి. బస్తీ దవాఖానాల ద్వారా ఓపీ, కుటుంబ నియంత్రణ కౌన్సిలింగ్, టీకాలు వేయడం, గర్భిణులు మరియు బాలింతలకు పరీక్షలు, ప్రాథమిక ల్యాబ్ పరీక్షలు, బీపీ, షుగర్, కేన్సర్ పరీక్షలు, చిన్నచిన్న రోగాలకు చికిత్సలు మరియు మందుల పంపిణీ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: