ఆమె వయసు 80 ఏళ్ళు... మంచి విద్యావేత్త.. అంతకు మించి పర్యావరణంపై అమితమైన ఆసక్తి కలిగిన మహిళ.  ఈ వయసులోనూ ఒంటరిగా జీవిస్తోంది.  బోటనీ ప్రొఫెసర్ గా పనిచేసిన ఆ మహిళ, తన ఇంటిని ఓ అడవిగా మార్చేసింది.  ఇంట్లో ఒక్కతే ఉంటుంది.  ఇంటికి కరెంట్ ఉండదు.  ఉన్నా, దాని ఆమె ఏనాడు వినియోగించలేదు.  

 


దానికి కారణం ఉన్నది.  ఒకవేళ మనం ఒక సుఖానికి అలవాటు పడితే, దాని వలన మరొకరికి కష్టం కలుగుతుంది.  అటువంటి కష్టాలు ఎందుకు వాటికీ ఇవ్వాలి అన్నది ఆమె వాదన.  ఉదయం బయట వెలుగు ఉంటుంది.  ఆ వెలుగులోనే అన్ని పనులు చక్కబెట్టుకుంటుంది.  రాత్రి సమయంలో కిరోసిన్ దీపం ఉండనే ఉన్నది.  పుస్తకాలే ఆమె వ్యాపకం.  

 


నిత్యం ఆమె దగ్గరకు ఎంతోమంది వస్తుంటారు.  ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటారు.  ఎందరినో విద్యావేత్తలుగా తీర్చిదిద్దింది.  ఇప్పుడు పూణేలో ఆమె ఉంటున్న ఇల్లు చూస్తే ప్రతి ఒక్కరికి షాక్ తగులుతుంది.  స్వతహాగా బోటనీ ప్రొఫెసర్ కాబట్టి ఇంటి చుట్టూ మొక్కలు నాటింది.  ఇప్పుడు అది ఒక మినీ అడవిగా మారిపోయింది.  

 


నిత్యం ఆ మొక్కలతోనే ఆమె కాలక్షేపం చేస్తుంది.  మొక్కలపైన ఇప్పటి వరకు ఆమె 25 పుస్తకాలు రాసింది.  ఇక శిష్యులైతే ఆమెను ఓ మినీ గూగుల్ అని పిలుస్తుంటారు.  ఎలాంటి సందేహం వచ్చినా ఆమె దగ్గరకు వెళ్తుంటారు.తాను పుట్టినపుడు కరెంట్ లేదు.  తన తల్లిదండ్రులు ఉన్నపుడు కూడా కరెంట్ లేదు.  తనకెందుకు కరెంట్ అని అంటోంది ఈ బామ్మ.  ఈ బామ్మపేరు చెప్పనేలేదు కదా... ఆమె పేరు హేమా సానే.  తన తరువాత ఆ ఇంటిని ఓ అనాధశరణాలయానికి ఇస్తానని అంటోంది. ఇటీవలే ఈ బామ్మ జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: