ఈ సృష్టిలో మాతృమూర్తి మమకారానికి మించినది మరొకటి ఉండదు. తన పిల్లల కోసం ఏ స్వార్థం లేకుండా సకలం త్యాగం చేసే దేవత తల్లి. నవ మాసాలు మోసి.. తన ప్రాణాన్నే బిడ్డకు జీవంగా పోసి.. ప్రసవ సమయంలో చావును ఎదిరించి.. పేగు తెంచుకుని భూమిపై పడ్డ తన రూపాన్ని చూసుకుని రెండోసారి జన్మిస్తుంది అమ్మ. అలాంటి బిడ్డ తన కళ్ల ముందే పసి ప్రాయంలోనే ఏడేళ్లకే కన్నుమూస్తే ఆ తల్లి తట్టుకోగలదా? ఆ అమ్మ ప్రాణం పోసైనా మళ్లీ బతికించుకోవాలని అనుకుంటుంది. కానీ కాల ధర్మానికి తల వంచి.. పట్టెడు దు:ఖాన్ని దిగమింగుతుంది.

 

మున్‌హ్వా బ్రాండ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఎంబీసీ) ‘ఐ మెట్ యూ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసింది. వీఆర్ టెక్నాలజీతో తల్లీబిడ్డలను కలపడమే ఆ డాక్యుమెంటరీ థీమ్. అందుకు కొరియాలోని జాంగ్ జీ సంగ్ అనే తల్లిని ఎంచుకుంది. ఆమె కూతురు నయాన్ ఓ జన్యుపరమైన అనారోగ్యం జలుబుతో మొదలై ఏకంగా ప్రాణం మింగేసింది. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు 2016లో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారిని బర్త్ డే నాడు కలిసి కొద్ది నిమిషాలు గడిపి, సెలబ్రేట్ చేసేలా కాన్సెప్ట్ డిజైన్ చేసింది.

 

జాంగ్ చిన్నగా ఎక్కడ నాన్నా అంటూ తన బిడ్డను పిలవగానే చిన్నగా అడుగులు వేస్తూ అమ్మా అంటూ తల్లి ఎదుటకు వస్తుంది. ‘నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావా? అమ్మా’ అని అడుగుతుంది చిన్నారి. దానికి ఆ తల్లి కంటతడి పెట్టుకుంటూ ‘ప్రతి రోజూ నువ్వు గుర్తొస్తావు నాన్నా.. నిన్ను మిస్ అవుతున్నాను’ అని చెబుతుంది. నిన్ను నా గుండెలకు హత్తుకోవాలనుంది కన్నా అంటూ విలపిస్తుంది. ఏడవకమ్మా అంటూ ఆ పాప తల్లిని ఓదారుస్తుంది. ఆ తర్వాత ఒక బల్లపై కూర్చుని ఆ తల్లి చిన్నారి బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: