ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)  ముచ్చటగా మూడోసారి దేశ రాజధాని ఢిల్లీలో విజయం సాధించి నూతన సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో ఈ నెల 16 ఉదయం 10 గంటలకు సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణం చేయనున్నారు. ఇంతకుముందు కూడా ఇదే మైదానంలో ఆయన రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, జాతీయ‌పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం తాజా ఓట‌మితో కుదేలు అవుతోంది.

 


 వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ 2015 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. నాటి ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈసారి 63 మంది డిపాజిట్లను కోల్పోయారు. ఇలా  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయంపై  ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పరిస్థితిపై సమీక్షించి, పునర్నిర్మించడానికి శస్త్రచికిత్స తరహాలో కార్యచరణ (సర్జికల్‌ యాక్షన్‌) చేపట్టాలని సూచించారు. మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ ‘బీజేపీని ఓడించగల శక్తి కేజ్రీవాల్‌కు మాత్రమే ఉందని ఓటర్లు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్‌కు ఓటు వేసినా ప్రయోజనం ఉండదని.. పైగా ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి చేకూరుతుందని భావించారు. అందుకే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఆప్‌కు తరలిపోయింది’ అని తెలిపారు. 

 


మ‌రోవైపు ఈ అవ‌మాన‌క‌ర‌మైన ఓట‌మి నేప‌థ్యంలో...ప్ర‌ధానంగా కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్తిస్థాయిలో అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. మరి సోనియానే పార్టీ అధ్యక్షురాలిగా ఉంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇక రాహుల్‌ గాంధీ ఈసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించేందుకు చురుకైన అధ్యక్షుడు కావాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: