డబ్బులెవరికీ ఊరికే రావు....కానీ మా మాట వింటే మీరు వద్దన్నా లక్ష్మీ దేవి మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటుందని నమ్మిస్తారు. అత్యాశకు పోయి వాళ్ల బురిడీ మాటలకు పడిపోయారా? ఇక అంతే లక్ష్మీ దేవి కాదు, అప్పులోళ్లు క్యూ కడతారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు తరచూ వెలుగులోకి వస్తున్నా...వాటిని నమ్మి మోసపోయే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ముఠాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

 

ఎంత పెట్టుబడి పెడితే అంత రెట్టింపు వస్తుంది. అదే రైస్ పుల్లింగ్ మిషన్... ఇది ఉంటే మీ డబ్బులు డబుల్ అవుతుంది. ఇదీ రైస్ పుల్లింగ్ ముఠాలు చెప్పే డైలాగులు... ఇలా చెప్పి అమాయకులను సులువుగా బుట్టలో వేసుకుంటారు. రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకం పేరిట అందినకాడికి దండుకుంటారు. ఆ తర్వాత పరారవుతారు. మామూలు వస్తువుకు అయస్కాంతం రాపిడి చేసి దాన్ని అద్భుత యంత్రంగా నమ్మిస్తారు. 

 

తెలుగు రాష్టాల్లో ఎక్కువ ఈ తరహా మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గం గుడుపల్లెలో సంచలనం సృష్టించిన రైస్‌పుల్లింగ్‌ ముఠా గుట్టు రట్టు చేసి..ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి కోటి 29 లక్షలు, 18లక్షల విలువైన ఇన్నోవా కారు, 2లక్షల విలువైన మారుతీకారు, 80వేల విలువైన ద్విచక్రవాహనంతోపాటు రైస్‌పుల్లింగ్‌కు వాడిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

రైస్ పుల్లింగ్ పేరుతో రెండు కోట్ల 10 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన ఎస్పీ సెంథిల్ కుమార్ కు ఫిర్యాదు అందింది. ఆయన ఆదేశాల మేరకు కుప్పం పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో కర్ణాటక, తమిళనాడుకు చెందిన వ్యక్తులున్నారు.

 

చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు ప్రాంతంలో రైస్‌ పుల్లింగ్‌ కొత్తేమీ కాదు. ఈ తరహా కేసులు ఇక్కడ తరచూ నమోదవుతూనే ఉంటాయి. యంత్రాన్ని బేరానికి పెట్టి...తీరా డబ్బులు ఇచ్చే సమయానికి నకిలీ పోలీసులు రంగ ప్రవేశం చేసి అంతా ఊడ్చేస్తారు. అలా కాకపోతే యంత్రాన్ని తీసుకెళ్లిన వారు దానికి ఎలాంటి మహిమలు లేవని తెలుసుకునే లోపు బార్డర్ దాటేస్తారు. గుడుపల్లె మండలంలో ఏడాదిన్నర క్రితం సంభవించిన ఇద్దరి అనుమానాస్పద మరణాలకు రైస్ పుల్లింగ్‌ ముఠాతో సంబంధం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీటిపై సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు మూసేశారు.

 

చదువుకోని వారే కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పదవుల్లో ఉన్నవాళ్లు కూడా ఈ రైస్ పుల్లింగ్ ముఠా బాధితుల లిస్ట్ లో ఉన్నారు. ఇటీవల తిరుపతికి చెందిన ఇద్దరు ఐఐటీ లెక్చలర్లు రైస్ పుల్లింగ్ ముఠా చేతిలో మోసపోయారు. అయితే తాము కోల్పోయిన డబ్బులను రాబట్టుకునేందుకు అదే యంత్రాన్ని ఎరగా వేస్తూ పోలీసులకు చిక్కారు. ఇలా చైన్ సిస్టం లాగా అమాయకులకు గాలం వేస్తున్న ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: