నగరాలకే పరిమితమైన డ్రగ్స్ సంస్కృతి గుంటూరులో  తిష్ట వేసింది. యువతే టార్గెట్‌గా రాజధాని ప్రాంతంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా జరుగుతోంది. మొదట్లో డ్రగ్స్‌ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న పోలీసులు..ఇప్పుడు ఈ విషయాన్ని అటకెక్కించారు. 

 

అమరావతి కేంద్రం అయిన గుంటూరులో మత్తు పదార్దాల రవాణా, వినియోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో  జిల్లాను కేంద్రంగా చేసుకొని  డ్రగ్స్‌ సరఫరా విచ్చలవిడిగా సాగుతోంది.  విదేశాలకు చెందిన విద్యార్దులు కూడ ఉండటం సంచలనం రేకెత్తించింది. కళాశాల విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ ముఠాలు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాయి. నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో విదేశీ విద్యార్ధులు మకాం వేసి చదువు పేరుతో.. యువతను డ్రగ్స్‌ మత్తులో దించుతున్నారు. సింథటిక్  డ్రగ్స్‌ వినియోగం కూడా పెరిపోయింది. దీంతో విదేశీ విద్యార్దులను అరెస్ట్‌ చేశారు గుంటూరు పోలీసులు.

 

అయితే విదేశీ విద్యార్దుల అరెస్ట్ తర్వాత ఈ కేసులో విచారణ పురోగతి ఏంటనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.  ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు  అంతంత మాత్రంగానే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  గతంలో మంగళగిరిలోని  ప్రైవేట్ కాలేజిలో విద్యార్దులు డ్రగ్స్‌ తీసుకుని ఉపాధ్యాయుడిపై దాడికి దిగటం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.ఈ సంఘటనలో విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేసి,మత్తు పదార్దాలను సరఫరా చేసిన దుకాణ యజమానిపై కూడా కేసు బనాయించారు పోలీసులు.

 

అయితే ప్రస్తుతం డ్రగ్స్ పై పోలీసులు అంతగా దృష్టి సారించటం లేదన్న వాదన వినిపిస్తోంది. పోలీసుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తూండటంతో  జిల్లా డ్రగ్స్‌ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది.  ఈ విషయంలో పోలీసులు మరింత దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

 

మొత్తానికి గుంటూరులో డ్రగ్స్ మహమ్మారి చెలరేగిపోతోంది. చదువుకోవాల్సిన విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పలుమార్లు పోలీసులు నిఘా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇపుడు మాత్రం పక్కా ప్లాన్ తో పోలీసులు దృష్టిసారించారు. విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంతేకాదు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఆరాతీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: