దేశవ్యాప్తంగా వచ్చే మార్చి నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో ఈ నాలుగు రాజ్యసభ స్థానాల నుంచి రాజ్యసభకు ఎవ‌రు ? ఎన్నిక అవుతారు అన్నది సహజంగానే ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార పార్టీ ఖాతాలోనే పడనున్నాయి. అయితే జగన్ గత ఏడాది ఎన్నికలకు ముందు ఏకంగా 30 మంది నాయకులకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.

 

అయితే మారిన రాజకీయ సమీకరణ‌ణాల నేపథ్యంలో జగన్ మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మండలి రద్దు అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ప‌లువురు ఆశావాహుల క‌న్ను నాలుగు రాజ్యసభ స్థానాల పై పడింది. వైసీపీ నేత‌ల్లో చాలా మంది ఎవరికి వారు రాజ్యసభ స్థానాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నాలుగు స్థానాల్లో ఒకటి రెడ్డికి, ఒకటి కాపుకి, ఒకటి కమ్మకి, ఒకటి వెలమ/దళితులు/ముస్లీమ్ వ‌ర్గాల్లో ఎవ‌రో ఒక‌రికి కేటాయిస్తార‌ని టాక్‌..?

 

రెడ్డి వ‌ర్గం నుంచి ఓ ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ పేరు వినిపిస్తోంది. ఆయ‌న గ‌తంలో పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి... గ‌త ఎన్నిక‌ల్లో సీటు కూడా త్యాగం చేశారు. ఇక కాపు వ‌ర్గం నుంచి చిరంజీవి పేరు లైన్లో ఉంది. ఇక క‌మ్మ వ‌ర్గం నుంచి చూస్తే గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌ల్లో ఉంది. వైఎస్ ఫ్యామిలీకి అనుంగు అనుచ‌రుడు మ‌ర్రి జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు.

 

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు చిల‌క‌లూరిపేట సీటు వ‌దులుకున్నారు. ఆ త్యాగానికి ఫ‌లితంగా మ‌ర్రిని జ‌గ‌న్ ఎమ్మెల్సీని చేసి త‌న మంత్రివ‌ర్గంలో కూర్చో పెట్టుకుంటాన‌ని చెప్పారు. అయితే ఇప్పుడు మండ‌లి ర‌ద్దు అవుతోన్న నేప‌థ్యంలో కమ్మ వ‌ర్గం నుంచి రాజ‌శేఖ‌ర్‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తార‌ని పార్టీలోనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. నిజాయితీతో కూడిన వ్య‌క్తిత్వం, విలువ‌లు... జ‌గ‌న్ మాట జ‌వ‌దాట‌క‌పోవ‌డం రాజ‌శేఖ‌ర్‌కు ప్ల‌స్‌లు కానున్నాయి. క‌మ్మ వ‌ర్గంలో పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉండ‌డంతో పాటు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి హామీ ఇచ్చి నేత కావ‌డం.. ఇప్పుడు మండ‌లి ర‌ద్దు అయితే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చే ఛాన్స్ లేక‌పోవ‌డంతోనే ఆయ‌న పేరు రాజ్య‌స‌భ రేసులో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: