మహబూబాబాద్ జిల్లా సహకార సంఘ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ మధ్య నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇరు వర్గీయులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసి అంతేస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ గెలుపుపై ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కురవి మండలం గుండ్రాతిమడుగు సహకార ఎన్నికల్లో పట్టు కోసం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ వర్గీయులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న రీతిలో నడుస్తుండడం జిల్లాలో చర్చనీయాంశమైంది. 

 

డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యా సూచించిన పెద్దలే చక్రం తిప్పుతుండగా గుండ్రాతి మడుగు సొసైటీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మంత్రి సత్యవతి రాథోడ్ స్వగ్రామం గుండ్రాతిమడుగు కావడం ఆమె ముఖ్య అనుచరుడైన జెడ్పీటీసీ సభ్యులు బండి వెంకట్ రెడ్డి  తన  అనుయాయులను పోటీలో నిలిపి సొసైటీ డైరెక్టర్ల గెలుపు కోసం అంతా తానై  ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిగా బండి బుచ్చిరెడ్డి ని ప్రకటించారు. 

 

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాత్రం చైర్మన్ అభ్యర్థిగా గార్లపాటి వెంకట్ రెడ్డిని ప్రకటించి అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపి గెలిపించి మంత్రిపై పై చేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఒకే పార్టీ నుంచి మంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు సహకార ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు వేరువేరుగా అభ్యర్థులను బరిలో నిలపడం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు, మూడు దశాబ్దాలుగా వైరి వర్గాలుగా ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక  గులాబీ కండువా కప్పుకున్నారు. 

 

అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో సత్యవతి రాథోడ్ కు ఉహించని రీతిలో మంత్రి పదవి వరించడంతో రెడ్యాతో  పాటు తన వర్గీయులు జీర్ణించుకోలేపోతున్నారు.  ఇంతకాలంగా ఇరు వర్గీయులు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వైషమ్యాలు సహకార  సంఘం ఎన్నికల్లో  ఒక్కసారిగా  బయటపడ్డాయి. జిల్లాలో ఎక్కడ నలుగురు కనిపించిన ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. సహకార సంఘం ఎన్నికలో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: