తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న స‌ర్కారులో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన‌ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒకింత దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఆయ‌న కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారు.

 

అయితే,తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మాజీ నీటిపారుద‌ల శాఖ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య ఘాటుగా స్పందించారు. చేసిన పాపాలకు ప్రాయ‌చిత్తం కోసం కేసీఆర్ పూజలు చేస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``నదీజలాల సముద్రం పాలు, ఖజానా కల్వకుంట్ల పాలు అయింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతోంది. కాళేశ్వరం ఒక ఐరావతం. ప్రచార అస్త్రం లాగా ఉపయోగించుకుంటున్నారు. 105 రోజుల్లో మూడు బ్యారేజీ ల నుంచి మిడ్ మానేరు కు ఒక్క చుక్క నీరు తీసుకురాలేదు కదా?రోజుకు మరో టీఎంసీ నీటికి 4,400 కోట్ల రూపాయ‌లు దుబారా కాదా? ఎవరిని మభ్యపెడుతున్నారు ఇలా` అని ప్ర‌శ్నించారు. 

 

నవంబర్‌లో మేడిగడ్డ దగ్గర మీరు చెప్పిన లెక్క ప్రకారం నీళ్లు లేనే లేవని పొన్నాల లక్ష్మ‌య్య వాదించారు. ``నేను చెప్పేది అబద్ధం అని చెప్తారా...నేను ఆధారాలతో చూపిస్తా. ఇది నిరార్థక ఆస్తి కాదా..ప్రజలకు ఉపయోగపడనిది నిరర్దకం. దోపిడీని బయటకు రాకుండా పూజలతో మభ్యపెడుతున్నారు. పూజలు చేసుకుంటే తప్పేం కాదు...దోపిడీ చేస్తేనే తప్పు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్ట్ లు నిర్మాణ చేస్తే అవాకులు చవాకులు పేలారు. నల్గొండ టన్నెల్ పనులను ఎందుకు పరిశీలించరు. నిర్మాణ పనులు చేయాల్సి ఉన్న ఎందుకు వెల్లట్లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు దగ్గరకి ఎందుకు వెళ్ళట్లేదు. కంతనపల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. తుపాకులగూడెం ప్రాజెక్టుకు సమ్మక్క పేరు పెడుతా అంటూ మరొకసారి మభ్యపెడుతున్నారు. పూజలు దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే చేస్తున్నారు. `` అని ఆరోపించారు.

 


తుమ్మిడిహెట్టి, తుపాకులగూడెం, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ తో పాటు ఆన్ గోయింగ్ ప్రాజెక్టు లు వెంటనే పూర్తి చేయాలని లక్ష్మ‌య్య డిమాండ్ చేశారు. ``నిరర్థక అస్తుల గురించి వివరణ ఇవ్వాలి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వీటన్నిటికీ సమాధానం ఇవ్వాలి. సీఎం చర్చకు సిద్ధమా..ఎవరినైనా చర్చకు రమ్మను. కాళేశ్వరం పేరు మీద 50 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటి వ‌ర‌కూ ఒక్క చుక్క నీరు వాడుకోలేదు. ఎక్కడికి వెళ్లినా కాళేశ్వరం పేరు తప్ప... దాంతో వచ్చింది ఏమి లేదు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారు, దోచుకుంటున్నారు`` అని విరుచుకుప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: