ఏపీ సీఎం జగన్, ప్రధాన మంత్రి మోడీ సుదీర్ఘ సమావేశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై వైసీపీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. జగన్ సర్కారు చర్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని మోదీ జగన్‌ వద్ద అసంతృప్తి వ్యక్తం చేశాడని... రాష్ట్రంపై వారిలో అపనమ్మకం ఏర్పడిందని.. ఇటీవలి దావోస్‌ సదస్సులోనూ పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారని ఆ పత్రికలు రాసుకొచ్చాయి.



పీపీఏల పునఃసమీక్ష, విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం, కియా మోటార్స్‌ యాజమాన్యానికి బెదిరింపులు, కియా తరలింపు వార్తలు.. ఇవన్నిటిపైనా మోడీ జగన్ ను ప్రశ్నించారని ఆ పత్రిక రాసింది. ఈ రాతలపై మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే.. “ ప్రధాని చివాట్లు పెట్టాడని ఈ పత్రికలు రాశాయి. లోపల ఏం జరిగిందో మీకు ఏం తెలుసు. ఆ టైమ్‌లో కార్పెట్‌లు క్లీన్‌ చేస్తున్నారా.. లేక వారిద్దరి తాగిన కాఫీ కప్పులు తీశారా..? బాత్‌రూమ్‌లు క్లీన్‌ చేస్తున్నారా..? అని నిలదీశారు.



" కొన్ని పత్రికలు ఏం రాస్తున్నామనే స్పృహ కూడా కోల్పోయి ప్రవర్తిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా చంద్రబాబు, యనమల, పచ్చమీడియా తయారయ్యాయి. వీళ్లెన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు రాయించినా ప్రజలు నమ్మరు.. నరేంద్రమోడీని విమర్శిస్తూ ‘గుండెల్లో నిద్రపోతా’.. ‘అబద్ధాల పుట్ట నరేంద్రమోడీ’.. అని చంద్రబాబు అనడం ఎల్లో మీడియా పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాశాయి. “



" సిగ్గులేకుండా మాట్లాడి.. ఇప్పుడు బీజేపీతో జతకట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంపీలను నలుగురిని బీజేపీలో జాయిన్‌ చేయించాడు. పాట్నర్‌ను తీసుకెళ్లి పొత్తుపెట్టించాడు. కమ్యూనిస్టులు ఏం మాట్లాడకుండా ఉండేందుకు ఉద్యమంలో కలుపుకున్నాడు. నిరంతరం దిగజారుడు రాజకీయాలు చేయడం తప్ప.. నీతిగా రాజకీయం చేయలేడు..అంటూ చంద్రబాబునూ, ఆయన అనుకూల మీడియాను కడిగిపారేశారు కన్నబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: