నిర్భయ దోషులకు ఉరి ఇప్పట్లో తేలేలా లేదు. వేర్వేరుగా దోషులను ఉరి తీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. మరోవైపు దోషులు తమ చివరి అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో శిక్ష అమలు మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ లోపు తమ స్పందన తెలియజేయాలంటూ  దోషులను ఆదేశించింది. ఢిల్లీ ట్రయల్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ట్రయల్‌ కోర్టు తీర్పు తర్వాత శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ పిటిషన్‌ను విచారించనుంది.

 

మరోవైపు.. దోషి పవన్‌ గుప్తా తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది అంజనా ప్రకాశ్‌ను అమికస్‌ క్యూరీగా నియమించింది. దోషుల్లో ముగ్గురు ఇప్పటికే తమ చిట్టచివరి అవకాశమైన క్యురేటివ్‌ పిటిషన్‌ను వినియోగించుకున్నారు. పవన్‌ గుప్తా మాత్రం ఇంకా ఈ పిటిషన్‌ దాఖలు చేయలేదు. తుది శ్వాస వరకూ దోషికి న్యాయ సహాయం పొందే వీలుందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పాటు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం కూడా అతడికి ఉంది. దోషులు ఒకరి తర్వాత మరొకరు క్యురేటివ్‌ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు వేస్తూ శిక్షను జాప్యం చేస్తున్నారు. 

 

 మరోవైపు.. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని దోషి వినయ్‌ శర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాడు. మరోవైపు వినయ్‌ శర్మ మానసిక స్థితి సరిగా లేదని అతని తరపు న్యాయవాది వాదించారు. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని ఉరితీయకూడదని కోరారు. గతంలో దేవేంద్ర పాల్ సింగ్ అనే దోషికి ఉరిశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.

 

 దోషులకు శిక్ష అమలులో జాప్యం జరుగుతుండడంపై నిర్భయ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ కొత్త వాదనలు తెరపైకి తీసుకురావడంతో శిక్ష మరింత జాప్యమయ్యే అవకాశముంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: