నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులను కోవిడ్ వైరస్ ఇబ్బంది పెడుతోంది. అసలే మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న వారికి కోవిడ్ మరింత చిక్కులు తెచ్చిపెట్టింది. వైరస్ సాకుతో వ్యాపారులు సిండికేట్  అయి ధర తగ్గిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల జిమ్మిక్కులపై జిల్లా అదికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు. అయితే వ్యాపారులు మాత్రం కరోనా ఎఫెక్ట్‌తో ఎగుమతులు తగ్గి, పాత నిల్వలు  పేరుకుపోవడం వల్లే ధర తగ్గడానికి కారణం అని చెబుతున్నారు. 

 

నిజామాబాద్ జిల్లాలో పసుపు సుమారు 40 వేల ఎకరాలలో సాగవుతోంది. పెట్టుబడి వ్యయం రెండింతలు పెరిగినా ఈసారి రైతన్నలు వెనక్కి తగ్గకుండా పంటను సాగు చేశారు.9 నెలల పాటు పంటను కంటికి  రెప్పలా కాపాడుకున్నారు. ఇప్పుడిప్పుడే అమ్మకానికి మార్కెట్‌కు తరలిస్తున్నారు రైతులు. పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభమైంది. ఐతే...రైతులకు లభించే ధర మాత్రం పూర్తిగా పతనం అవుతోంది. ఎకరానికి లక్ష నుంచి  లక్షా 20 వేల ఖర్చు చేస్తున్నా దిగుబడులు లేక నష్టపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాల్ పసుపు ధర 3 వేల 5 వందల నుంచి 5 వేల 5 వందల వరకు పలుకుతోంది. అసలే ధరల్లేక దిగాలు చెందుతున్న పసుపు  రైతులకు కోవిడ్ వైరస్ రూపంలో మరో ఇబ్బంది వచ్చి పడింది. కోవిడ్‌ సాకుతో పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కోవిడ్‌ వైరస్ సాకు చూపించి  ధరలను బారీగా తగ్గిస్తున్నారని రైతులు  మండిపడుతున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక కారణం చూపించి ధరలను తగ్గిస్తున్నారని చెబుతున్నారు రైతులు.

 

నిజామాబాద్ మార్కెట్ పసుపు క్రయవిక్రయాలకు ప్రసిద్ది. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ తరవాత ఆ స్దాయిలో కొనుగోళ్లు-అమ్మకాలు నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే జరుగుతాయి. సీజన్ ప్రారంభమై 10 రోజులు  గడుస్తున్నా  రైతులకు మాత్రం ధరల షాక్ తగులుతూనే ఉంది. రోజురోజుకు ధరలు పతనమై అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 50 వేల క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు వచ్చింది. ఈ నెల 25 నుంచి పసుపు  రాక మరింత పెరగనుంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 3 లక్షల క్వింటాళ్ల పసుపు నిల్వలు ఉన్నాయని వ్యాపారులు కొత్త నాటకానికి తెరలేపారు. పాత నిల్వలకు తోడు చైనా, ఇరాన్‌కు ఎగుమతులు తగ్గిపోవడం వల్లే  ధరలు తగ్గాయని  దీనికి కరోనా ఎఫెక్ట్ కారణం అని వ్యాపారులు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే వ్యాపారులు కూటమి కట్టి కరోనా సాగుతో రైతులను నిలుపుదోపిడి చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ దృష్టి  సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు రైతు సంఘాల నేతలు. 


 
 ఇక...పసుపు ధరలు గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు వెయ్యి నుంచి రెండు  వేలకు తగ్గిపోయాయి. ప్రస్తుతం క్వింటాకు 3 వేల నుంచి 5 వేలకు మించి ధర పలకడం లేదు. అయితే ధరల పతనానికి ఎగుమతులు  తగ్గిపోవడం, పాత నిల్వలు పేరుకుపోవడం కారణమని వ్యాపారులు చెబుతున్నట్లు మార్కెట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అసలే ధరల్లేక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మరో పిడుగు పడినట్లు అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: