స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కన్నడ ఐక్య సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల ఆందోళనకారులు శృతి మించారు. మంగళూరులో ఏపీ టూరిజం బస్సుపై రాళ్లతో దాడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని సంఘాలు ప్రకటించాయి.

 

రిజర్వేషన్ల అంశంపై కర్నాటక అట్టుడికింది. కన్నడిగులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్నాటకలోని 113 ప్రజాసంఘాలు, సంస్థలు చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా   దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. రవాణా దాదాపు స్తంభించింది. ప్రైవేటు టూర్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా  బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బెంగళూరులో సిటీ బస్సులు అతి తక్కువగా నడిచాయి.. ఓలా లాంటి సర్వీసులు కూడా నిలిచిపోయాయి.

 

1984లో కేంద్ర మాజీ మంత్రి సరోజిని మహిషి కన్నడిగులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫారసు చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని సరోజిని మహిషి సూచించారు. ఆ రిపోర్ట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్నాటకలోని సంఘాలన్నీ కలిసి బంద్‌ చేపట్టాయి. విపక్షాలతోపాటు కర్నాటక ఫిలిం ఛాంబర్, లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్లు కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.

 

 బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు కారణమైంది. మంగళూరులో ఏపీ టూరిజం బస్సుపై రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. ఫరంగిపేట్‌లో ఈ ఘటన జరిగింది. తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలెలో బలవంతంగా షాపులు మూసేయించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.  ప్రభుత్వం ఇప్పటికైనా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఐక్య సంఘాల అధ్యక్షుడు నాగేశ్‌ హెచ్చరించారు. 

 

 బంద్‌ ప్రభావం జనజీవనంపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు యధాతథంగా నడుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే చాలాచోట్ల అవి మూతపడ్డాయి. సరోజిని మహిషి రిపోర్ట్‌ను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్‌లో చర్చించి దశలవారీగా దీన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఇదంతా ఆషామాషీ వ్య వహారం కాదని, అనేక సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బలవంతం చేస్తే కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉంటుందని భయపడుతోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: