జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చివరకు ఎన్నికల వ్యూహకర్తపైనే ఆధారపడనున్నారా ?, మళ్ళీ అధికారం లోకి రావాలంటే ఎన్నికల వ్యూహకర్తలే దిక్కని ఆయన భావిస్తున్నారా?? అంటే అవుననే ఆ పార్టీ వర్గాల నుంచి సమాధానం విన్పిస్తోంది . మరో నాలుగేళ్ళ అనంతరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే , ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది .

 

అందుకే నెంబర్ వన్ ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ స్నేహితుడు , ఆయన నేతృత్వం లోని సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ , ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థలకు వ్యవస్థాపక  సభ్యుడైన  రాబిన్ శర్మ సేవల్ని వినియోగించుకోవాలని  టీడీపీ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం . ఈ మేరకు పెద్ద మొత్తం లో పారితోషికం చెల్లించేందుకు కూడా టీడీపీ నాయకత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది .  రాబిన్ శర్మ గతం లో ప్రధాని మోడీ ప్రచార వ్యవహారాలను కూడా చూసుకున్నారు .

 

ప్రస్తుతం ఏపీ లో మూడు రాజధానులు , కులపరమైన రాజకీయాలపై  అధ్యయనం చేస్తోన్న రాబిన్ బృందం, త్వరలోనే చంద్రబాబుకు ఒక నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది . అదే సమయం లో తర్వలోనే జరగనున్న  స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాబిన్ శర్మ బృందం  పని కూడా ప్రారంభించినట్లు సమాచారం  .

 

అయితే రాజకీయాల్లో చాణక్యునిగా పేరుగాంచిన చంద్రబాబు , రాజకీయ వ్యూహకర్తపై ఆధారపడడానికి పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ , పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది . ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  వైస్సార్ కాంగ్రెస్  పార్టీ  నాయకత్వం, ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుని అధికార పీఠాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే  .

మరింత సమాచారం తెలుసుకోండి: