ప్రకాశం జిల్లా దొనకొండ.. 2014 లో జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈ ప్రాంతం దశ తిరిగిపోయేదని చెబుతారు. ఎందుకంటే.. జగన్ 2014లో అధికారంలోకి వస్తే... ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలని భావించారని చెబుతారు. అంతే కాదు. ఎలాగూ గెలుస్తామననే నమ్మకంతో వైసీపీ నాయకులు ఈ దొనకొండ ప్రాంతంలో భారీగా భూములు కొన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.



కానీ 2014లో జగన్ పార్టీ ఓటమితో ఆ కలలు నెరవేరలేదు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినా దొనకొండలో రాజధాని పెట్టే పరిస్థితి లేదు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని జగన్ నిర్ణయించేసుకున్నాడు కూడా. అయితే జగన్ మాత్రం దొనకొండను మరిచిపోలేదేమో అనిపిస్తోంది ఈ వార్త చూస్తుంటే. అదేంటంటే.. ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలిస్తున్నారట.



దొనకొండ ప్రాంతంలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇందుకోసం సుమారు ఐదువేల ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెడ్‌క్యాప్‌ సంస్థ బృందం ఈ ప్రాంతంలో భూముల పరిశీలన చేపట్టింది. దొనకొండలో 25,086 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు రెవెన్యూ శాఖ సర్వే ద్వారా గుర్తించారు.



నెడ్‌క్యాప్‌ డీజీఎం సీబీ జగదీశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా మేనేజర్‌ జి.బుచ్చిరాజు గతవారం ఈ భూములపై హైలెవెల్‌ టెక్నికల్‌ సర్వే నిర్వహించారు. సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను చేపట్టే అవకాశం ఉంది. అలాగే ఏడాదిలో పూర్తి చేస్తారట. ఆ తరువాత ఏడాది కల్లా విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉందట. ఇదే నిజమైతే.. దొనకొండకు కొత్త కళ వచ్చినట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: