ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసి పరీక్షలు నిర్వహించి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే. గత నెల 26వ తేదీ నుండి రాష్ట్రంలో గ్రామ, వార్డ్ సచివాలయ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 1,26,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా వివిధ కారణాల వలన 14,061 ఉద్యోగాల భర్తీ జరగలేదు. 
 
మిగిలిన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల కొరకు ప్రభుత్వం గతనెలలో నోటిఫికేషన్ ను విడుదల చేసింది, గత వారమే ఈ ఉద్యోగాలను సంబంధించిన ధరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. గ్రామ, వార్డు సచివాలయాలలో మిగిలిన ఉద్యోగాలకు మార్చి నెల చివరి వారంలో రాత పరీక్ష జరగనుంది. ప్రభుత్వం ప్రశ్నాపత్రం తయారీ నుండి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు అన్ని బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించింది. 
 
ఏపీపీఎస్సీ నాలుగు రోజుల్లో గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలను నిర్వహించి ఫలితాలను వారం రోజులలో ప్రకటించి జిల్లా ఎంపిక కమిటీకి బాధ్యతలను అప్పగించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ధరఖాస్తు గడువు ముగిసేనాటికి 11,06,614 ధరఖాస్తులు రావడం గమనార్హం. కేటగిరీ 1 లోని పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి, గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శి, సంక్షేమ విద్య సహాయక పోస్టులకు 4.56 లక్షల ధరఖాస్తులు వచ్చాయి. 
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేస్తూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల మూడవ వారంలో ఉద్యోగ క్యాలెండర్ ను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం అందుతోంది. ఉద్యోగ క్యాలెండర్ ద్వారా ఏపీలో దాదాపు 53,000 ఉద్యోగాల భర్తీ జరగనున్నట్టు తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: