ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ 2015 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. నాటి ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈసారి 63 మంది డిపాజిట్లను కోల్పోయారు.  ఈ నేప‌థ్యంలో...పార్టీ తీరుపై సొంత నేతలే మండిపడుతున్నారు. పార్టీ పునరుద్ధరణకు ‘సర్జికల్‌ యాక్షన్‌' అవసరమని మరో కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా...పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు ఢిల్లీ ఫలితాలు కరోనా వైరస్‌ లాంటి పెద్ద విపత్తు అని అభివర్ణించారు.

 

కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ పుస్తక వేడుకలో పాల్గొన్న జైరాంర‌మేశ్ ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని.. లేకపోతే, రాబోయే పరిణామాల్ని అందరం కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.  ‘కాంగ్రెస్‌ నాయకులు తమను తాము పునరుద్ధరించుకోవాలి. ప్రజలతో మమేకం అవ్వాలంటే పార్టీ కూడా పునరుజ్జీవింపజేయాలి’ అని తెలిపారు. అలా జరుగకపోతే, ప్రజలకు దూరమవుతామని రమేశ్‌ హెచ్చరించారు. అధికారానికి దూరమై ఆరేళ్లు గడిచినప్పటికీ, పార్టీలోని కొందరు నేతలకు అహంకారం తగ్గలేదని, తామింకా మంత్రులమే అన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ బలోపేతం కోసం.. స్థానిక నేతలకు నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛనివ్వాలని సూచించారు.

 

ఇదిలాఉండ‌గా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్తిస్థాయిలో అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. మరి సోనియానే పార్టీ అధ్యక్షురాలిగా ఉంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇక రాహుల్‌ గాంధీ ఈసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించేందుకు చురుకైన అధ్యక్షుడు కావాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: