టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీలు లేవని చిన్న, పెద్ద ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ పెద్దగా ప్రభావం చూపటం లేదని బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అని తాము చెప్పలేమని అన్నారు. కేంద్రం రాష్ట్రాల పట్ల అహంకార వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్రం వైఖరి తమకు నచ్చడం లేదని కేటీఆర్ చెప్పారు. 
 
కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేదానికంటే తెలంగాణ రాష్ట్రం కేంద్రానికిచ్చేదే ఎక్కువగా ఉందని అన్నారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు ఇచ్చి తప్పు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటే మాత్రమే కేంద్రం బలంగా ఉంటుందని ఆ విషయాన్ని కేంద్రం గ్రహించాలని కేటీఆర్ కోరారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీసిందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్ లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని దేశాన్ని సంపూర్ణ క్రాంతి వైపు తీసుకెళుతున్నామని చెప్పారని మోదీ మాటలను నమ్మి తమ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుకు మద్దతు పలికిందని కానీ పెద్ద నోట్ల రద్దుకు తాము మద్దతు ఇచ్చినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారీగా విఘాతం కలిగించిందని కేటీఆర్ అన్నారు. 
 
పెద్ద నోట్ల రద్దు వలనే వృద్ధిరేటు 5.5 శాతం నుండి 3 - 4 శాతం మధ్య ఊగిసలాడుతోందని వృద్ధిరేటు తగ్గటానికి పెద్దనోట్ల రద్దు ఎంతో కొంత కారణమైందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి భావజాలం రాష్ట్రాలపై రుద్దడం ప్రారంభిస్తే అది దేశానికి ఏ మాత్రం మేలు చేయదని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రాలు ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా తయారవుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: