పల్లెను మేల్కొలిపే పక్షుల్లో పిచ్చుకలది ప్రత్యేక స్థానం. ఇంటి చూరులోనో, చేదబావిలోనో గూడుపెట్టే ఊరవిష్కల సందడి మరీనూ.. జనావాసాల నడుమ బతికే ఈ చిట్టిపిట్టను, దాని చేష్టలను చూడడం చిన్నారులకే కాదు, పెద్దలకూ ఆటవిడుపే మరి. తల పండిన ఇంజినీర్లు సైతం అసూయపడేలా ఈత, తాటి, తుమ్మ చెట్ల కొనల్లో సకల సౌకర్యాలతో కళాత్మకంగా గూళ్లు కట్టే గిజిగాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 35 రకాల పిచ్చుకలను గుర్తించారు.  

 

ఆయా ప్రాంతాల్లో నివసించే పిచ్చుకలకు వాటి రంగు, రూపురేఖలకు అనుగుణంగా వారి వారి భాషల్లో పేర్లు పెట్టారు. ఇంజినీర్లను సైతం ఆశ్చర్యపరచే స్థాయిలో నిర్మాణ నైపుణ్యం చూపుతాయి. ఇతర పక్షులు తమ గూట్లోకి ముందు నుంచో, పై నుంచో చేరుతాయి. కానీ పిచ్చుకలు మాత్రం గూడు కింది భాగం నుంచి లోపలికి చేరేలా ఏర్పాటు చేసుకుంటాయి. మగ పిచ్చుకలు కొత్త నారతో గూడు అల్లుతాయి. అవి బాగుంటేనే ఆడపిచ్చుకలు జతకడుతాయి.

 

పెరుగుతున్న పట్టణీకరణ, అంతరించిపోతున్న అడవులు, పంట చేలపై రసాయనాలు, పురుగుమందుల పిచికారీ, ఆహార ధాన్యాల కొరత, నదులు, వాతావరణ కాలుష్యం లాంటి అనేక కారణాలు పిచ్చుకలకు మరణశాసనం లిఖిస్తున్నాయి. దీనికితోడు విస్తరిస్తున్న సెల్‌ టవర్లు, వాటి నుంచి వెలువడుతున్న రేడియేషన్‌ పిచ్చుకలకు పెనుముప్పుగా పరిణమించాయి. గూన ఇళ్ల స్థానంలో డాబాలు వెలుస్తుండడం, బావుల స్థానంలో బోర్లు తవ్వుతుండడం, ఈత, తాటి, తుమ్మ చెట్లను నరుకుతుండడంతో పిచ్చుకల సహజ ఆవాసాలు దెబ్బతింటున్నాయి.

 

చిరుధాన్యాల సాగు తగ్గడం,  ఆహార కొరత ఏర్పడుతోంది. పిచ్చుకల గురించి ఈ తరానికి కథలాగ చెప్పడం తప్ప వాటితో మనకున్న అనుబంధం, ఆ అనుభూతిని వర్ణించలేము. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పిచ్చుకలు అంతరించిపోతున్నాయనే ఆవేదన పక్షి ప్రేమికులను ఆవేదనకు గురి చేస్తోంది.  ఈ పిచ్చుక గూళ్లు వీడియో మీ కోసం... దయచేసి చివరి వరకు చూడండి

మరింత సమాచారం తెలుసుకోండి: