ఆదిలాబాద్ డీసీసీబీ పీఠంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. చైర్మన్ రేసులో ఉన్న వాళ్లంతా తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే అనుచరుడికే పదవి ఇస్తానంటే ఉమ్మడి జిల్లాలో మిగతా 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రి సపోర్ట్ ఇస్తారా? అనేది ప్రశ్నగా మారింది. అధిష్టానం మనసులో ఏముందో తెలియక ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు.

 

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే సహకార సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. తర్వాత మండలం,  పీఏసీఎస్ మొత్తం ఏకగ్రీవం చేసుకోని చైర్మన్ గా లైన్ క్లియర్ చేసుకున్నారు కొందరు. అయితే డిసీసీబీ చైర్మన్ కావాలంటే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్. 

 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 77 మంది చైర్మన్ల ఎన్నిక జరగాలి. ఆ తర్వాత 77 మంది చైర్మన్ లు కలిసి డిసీసీబీకి 21 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. ఇందులో నుంచి డిసీసీబీ చైర్మన్, ఇంకొకరు వైస్ చైర్మన్ ,అలాగే డీసీఎంఎస్ చైర్మన్ , వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఇది మొత్తం ప్రక్రియ.  

 

ఉమ్మడి జిల్లాలో 77 సహకార సంఘాలుండగా వాటి చైర్మన్లలంతా కలిసి డైరెక్టర్లను ఆ తర్వాత చైర్మన్ లను  ఎన్నుకుంటారు. అయితే ఇప్పటికీ కేవలం ఆదిలాబాద్ జిల్లా తప్పా మిగతా మూడు జిల్లాల నుంచి డీసీసీబీ చైర్మన్ కోసం బరిలో ఉన్న వాళ్ల  పేర్లు అధికారికంగా తెరపైకి రాలేదు. ఆదిలాబాద్ లో తాజా మాజీ డిసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి,నాటి నుంచి ఉద్యమాల్లో చురుగ్గా  పాల్గొన్న బాలురి గోవర్థన్ రెడ్డిలు పదవులు ఆశిస్తున్నారు.  

 

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న సన్నిహిత అనుచరుడు అడ్డి బోజారెడ్డి రేసులో ఉన్నారు. దామోదర్ రెడ్డి.. జోగురామన్న మనిషే అయినా, ఈయన రాష్ట్ర డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డికి అల్లుడు..ఇక బాలూరి గోవర్ఢన్ రెడ్డి ఉద్యమ నాయకుడిగా పేరుంది. పైగా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఈయనకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే మిగతా ఇద్దరు పదవుల్లో పొందిన వాళ్లే. కాబట్టి గోవర్ఢన్ రెడ్డి డీసీసీబీ పదవిపై ఆశ పెట్టుకున్నాడనే టాక్ ఉంది.  

 

ఆదిలాబాద్ జిల్లా కు చెందిన ముగ్గురు నేతలు డిసిసీబీ చైర్మన్ రేసులో ఉండగా మరి మిగతా జిల్లాల వారు మిగిలిన పదవులు పంచుకోనున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాకు బ్యాంకు డైరెక్టర్లు 22 మందికాగా,  ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున పదవులు రానున్నాయి. ఆయా ఎమ్మెల్యేలు చెప్పిన వారికే డైరెక్టర్ పోస్టులు ఖాయం. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేల పరిధిలోనే చైర్మన్ ఆశావాహులు ఉన్నారు. అయితే మంత్రి, మిగతా ఎమ్మెల్యేలు వ్యూహం అంతు పట్టక ఆశావాహులు టెన్షన్ పడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: