వచ్చే నెల 15నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాలు ప్రారంభమైన వారం పది రోజుల్లో బడ్జెట్‌ ఆమోదించి...  ఆ తర్వాత వివిధ అంశాలపై చర్చించనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లుల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రణాళికల్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15నుంచి  ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీరాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. 

 

గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాజధాని-అభివృద్ది వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టింది.అయితే శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసనమండలిలో బ్రేక్ పడింది. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించడంతో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చేసింది. 


 
మార్చి 15వ తేదీ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు కూడా పూర్తి చేసుకొని, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటితే మూడు రాజధానులకు ప్రజల మద్దతు లభించినట్టేననే అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిరూపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: