ఏపీలో  రెండు బిల్లుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీ, శానస మండలిని ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో సీఆర్ డీఏ, వికేంద్రీకరణ బిల్లులకు ఆర్డినెన్స్‌ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగింది. బిల్లులు మండలి ముందున్నా.. సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా  శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్తుర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నర్  సభలను ప్రొరోగ్ చేయడం సాధారణ ప్రక్రియే అయినా... ఈ సారి మాత్రం ఇలా చేయడం అధికార పార్టీకి మేలు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్లులు సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భాలు రాజ్యసభలోనూ.. వివిధ అసెంబ్లీల్లోనూ ఉందంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ట్రిపుల్ తలాఖ్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం విషయంలోనూ సవరణల కోసం రెండు సార్లు కేంద్రం ఆర్డినెన్సులు జారీ చేశాయనేది ప్రభుత్వ వర్గాల వాదన.  

 

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్న ప్రభుత్వానికి ఉభయసభల ప్రోరోగ్ ఉత్తర్వులతో వెసులుబాటు లభించినట్టయింది. ఇప్పటికిప్పుడు మండలి రద్దుకాదు... తనకున్న బలంతో  ఎలాగైన సెలక్ట్ కమిటీని ఏర్పాటుచేసి జనంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని టీడీపీ భావిస్తోంది. దీంతో వైసీపీ ప్రతివ్యూహంతో ముందుకు వెళ్తోంది. సెలక్ట్ కమిటీతో సంబంధంలేకుండా ఆర్డినెన్స్ ను జారీ చేసి, పని మొదలు పెట్టాలని యోచిస్తోంది. అందుకే సెలక్ట్ కమిటీ ఏర్పాటును జాప్యం చేసినట్టు తెలుస్తోంది.  


   
ఒకసారి సెలక్ట్ కమిటీకి బిల్లును ఛైర్మన్ పంపించిన తర్వాత అదే బిల్లుపై ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసినా... లేకున్నా రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ ఇవ్వలేరని  చెబుతోంది. సెలక్ట్ కమిటీ రూల్ తో ప్రభుత్వానికి టీడీపీ షాక్ ఇస్తే.. మండలి రద్దుతీర్మానం చేసి, ఇప్పుడు ప్రొరోగ్ ద్వారా ఏకంగా  వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీయే సవరణ బిల్లులపై ఆర్డినెన్స్ కు సిద్ధమవుతోంది జగన్ ప్రభుత్వం. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ చెబుతోంది.  టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్‌ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. మరి ఈ ప్రోరోగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: