కఠిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ... పాలనా సంస్కరణలు అమలు చేయడంలోనూ... ఏపీ సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. దేశంలోనే బెస్ట్ సీఎం గా గుర్తింపు పొందాలనే ఆలోచనలో ఉన్న జగన్ దానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరిగే విషయంలో కఠినం గా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా పార్టీ నాయకులు కాస్త ఇబ్బంది పడుతున్నా జగన్ మాత్రం అవేవి పట్టించుకునేలా కనిపించడంలేదు. తాజాగా జగన్ ఎన్నికల సంస్కరణలు పైన కూడా దృష్టి పెట్టారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తన నిర్ణయాలు అమలు చేయాలని జగన్ చూస్తున్నారు. 


ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఎన్నికల సంస్కరణలపై జగన్ చర్చించారు. డబ్బు, మద్యం ప్రభావం లేని ఎన్నికల నిర్వహణే ధ్యేయంగా ప్రభుత్వం పని చేయాలంటూ జగన్ జగన్ క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. దీనికోసం చట్టంలో మార్పులు చేస్తూ త్వరలో ఆర్డినెన్స్ తీసి రాబోతున్నట్టు జగన్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఏపీ క్యాబినెట్ లో అనేక అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎక్కువ రోజులపాటు నిర్వహించడం వలన డబ్బు, మద్యం ప్రభావం తీవ్ర స్థాయిలో పెరుగుతోందని, అందుకే ఎన్నికల ప్రక్రియను స్వల్పకాలానికి ముగించేలా చట్టం చేయబోతున్నట్లు జగన్ ఈ సమావేశంలో వెల్లడించారు. 


ఇప్పటి వరకు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ 24 రోజుల పాటు ఉండేది. అయితే దీనిని 15 రోజులకు కుదిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలను ఇకపై 13 రోజుల్లోగా పూర్తి చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 7 రోజులు మాత్రమే గడువు ఇస్తారు. దీంతోపాటు ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేసే విధంగా కొత్త చట్టంలో మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


 ఈ విచారణ పూర్తయ్యేలోగా సదరు అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచినా సరే అక్రమాలు చేసినట్లు రుజువైతే వెంటనే వారిపై అనర్హత వేటు వేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, పదివేల రూపాయలు జరిమానా విధించే చట్టాన్ని తీసుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అభ్యర్థి తప్పనిసరిగా ఆ గ్రామంలోనే నివాసం ఉండేలా కొత్త చట్టాన్ని తీసుకు రాబోతున్నట్లు సమాచారం. అలాగే నిత్యం గ్రామ ప్రజలకు పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో సర్పంచ్ ఉండే లా  కొత్త చట్టంలో మార్పులు చేస్తున్నారు. 


వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటి నుంచే  స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా జగన్ క్యాబినెట్ లోని మంత్రులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.  ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకపోతే ఎలా అంటూ ఓ మంత్రి ప్రశ్నించగా ప్రస్తుతం ఒక గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయాలంటే కనీసం కోటి రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలలో పలుకుబడి కావాలి కానీ డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదని, ఆ విధంగానే ఎన్నికలు జరగాలన్నదే తన ఆకాంక్ష అని జగన్ క్లారిటీగా మంత్రులకు చెప్పారు.


 డబ్బు ప్రభావం లేకపోతే ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉన్న సామాన్యులు సైతం ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు మంచి చేస్తారని జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ప్రజా సేవ చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తులను, ప్రజలలో పలుకుబడి, మంచి పేరు ఉన్న వారిని గుర్తించినట్లుగా జగన్ చెప్పారు. ప్రస్తుతం జగన్ తీసుకున్న కఠిన నిర్ణయాలు పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడంలేదు. కాకపోతే ఇప్పుడు జగన్ ఆలోచిస్తున్న విధానం మాత్రం సరైనదేనని అన్నది చాలామంది అభిప్రాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: