ప్రతి ఊరిలో గుళ్ల ముందు చిన్న వయస్సు పెద్ద వయస్సు అనే తేడా లేకుండా బిచ్చగాళ్లు ఉంటారు. కానీ చాలా చోట్ల బిచ్చగాళ్లు గుళ్లలోకి వెళ్లడం, హుండీలో డబ్బులు వేయడం లాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. కానీ 75 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు తాను ఏ గుడి ముందు అయితే బిచ్చమెత్తుకున్నాడో అదే గుడికి 8 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి గుడి పూజారిని, భక్తులను షాక్ అయ్యేలా చేశాడు.         
 
పూర్తి వివరాలలోకి వెళితే ఒకప్పుడు రిక్షాను లాగుతూ బతుకు జీవనం సాగించిన యాదిరెడ్డి రిక్షా తొక్కీతొక్కీ మోకాళ్ల చిప్పలు అరిగిపోవడంతో జీవనం సాగించడం కొరకు వేరే దారి లేక విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా గుడి ముందు బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టాడు. అలా బిచ్చమెత్తుకోవడం ద్వారా సంపాదించిన డబ్బులలో తన ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను మరలా ఆలయానికి విరాళం రూపంలో తిరిగి ఇచ్చేవాడు. 
 
మొదట్లో లక్ష రూపాయలు గుడికి విరాళంగా ఇచ్చిన యాదిరెడ్డి ఈరోజు ముత్యాలంపాడులోని ఆలయానికి 8 లక్షల రూపాయల విరాళమిచ్చాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం దెబ్బ తింటోందని వచ్చిన డబ్బులను గుడికే తిరిగి ఇచ్చేస్తున్నానని యాదిరెడ్డి చెప్పారు. తాను గుడికి డబ్బులు విరాళంగా ఇస్తున్న విషయం భక్తులకు తెలియడంతో గతంతో పోలిస్తే తనకు వచ్చే డబ్బులు మరింతగా పెరిగాయని యాదిరెడ్డి చెబుతున్నారు. 
 
తాను సాయిబాబా గుడికి మాత్రమే విరాళాలను ఇవ్వడం లేదని మరికొన్ని ఆలయాలకు కూడా డబ్బులను విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి చెప్పుకొచ్చారు. తన జీవితాన్నంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానని యాదిరెడ్డి వెల్లడించారు. 8 లక్షల రూపాయలు బిచ్చగాడు గుడికి విరాళంగా ఇవ్వడంతో భక్తులు ఒకింత షాక్ కు గురవ్వడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు యాదిరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: