ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టెన్షన్ పడుతున్నాడని తెలుస్తోంది. మోదీకి జగన్ దగ్గరయితే ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి ఏమిటని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో తెలుగుదేశం పార్టీ భయాందోళనకు గురవుతుందో లేదో తెలియదు కానీ జనసేన పార్టీ అధినేత పవన్, జనసేన పార్టీ నేతలు తెగ ఫీలైపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఏపీలో కొన్ని రోజుల క్రితమే జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలలోను, 2024 సార్వత్రిక ఎన్నికలలోను బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ వైసీపీ కలిసి నడిచే సంకేతాలు కనిపిస్తూ ఉండటంతో జనసేన పార్టీ నేతలు బీజేపీ తమకు ఊహించని షాకులు ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
జనసేన పార్టీ నేతలు వైసీపీ బీజేపీ కలిసి నడిస్తే తమకు ఇబ్బందులు తప్పవని బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో టీవీలలో జరిగే చర్చలలో బీజేపీ, జనసేన పార్టీలను వేరు వేరుగా భావించి ఇరు పార్టీల నేతలను టీవీ ఛానెళ్లు ఆహ్వానించేవి. కానీ జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత జనసేన పార్టీ నేతలను ఛానెళ్లు పట్టించుకోవడం లేదని ఇరు పార్టీల తరపున బీజేపీ నేతలనే ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. 
 
మరోవైపు జగన్ రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిసి చర్చలు జరిపారు. తాజాగా ఈరోజు అమిత్ షాతో భేటీ కానున్నారు. వైసీపీ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరితే మాత్రం ఏపీలో జనసేన పరిస్థితి ఏమిటని పార్టీ అధినేతకు, నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఏపీలో బీజేపీ పార్టీ జనసేనకు ప్రాధాన్యత ఇస్తుందా..? లేదా...? చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: