రాష్ట్రంలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ.. రాష్ట్రంలోని వైసీపీ ప్ర‌భుత్వంతో మ‌చ్చిక చేసుకున్న‌ట్టుగా సంకేతాలు వస్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల‌ను కేంద్రంలోని పెద్ద‌లు కొనియాడ‌తారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చూపించార‌ని రాజ్య‌స‌భ‌లో ఆయన‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తారు. జ‌గ‌న్‌ను ప్ర‌జ‌ల ముఖ్య‌మంత్రిగా పేర్కొంటారు. ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే.. ఇక‌, బీజేపీ.. రాష్ట్రంలోని జ‌గ‌న్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయింద‌ని అనిపిస్తుంది.

 

కానీ, ఇంత‌లోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసే సీబీఐ మాత్రం జ‌గ‌న్‌పై క‌న్నెర్ర చేస్తుంది.  ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని.. ఆస్తుల కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరడం సరికాదని సీబీఐ తాజాగా కూడా స్పష్టం చేసింది. హాజరు మినహాయింపు ఏ నిందితుడికీ హక్కు కాదని, అది న్యాయస్థానం విచక్షణాధికారమని పేర్కొంది. నిందితుడి హోదా, ఆర్థిక స్తోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలిపింది.

 

వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ  పిటిషన్లను కొట్టేయాలంటూ సీబీఐ హైదరాబాద్‌ విభాగం ఎస్పీ పీసీ కల్యాణ్‌.. 17 పేజీల కౌంటర్‌ అఫివిడవిట్‌ దాఖలు చేశారు. నిజానికి ఎక్క‌డి సీబీఐ అయినా ..కేంద్రం క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేస్తుంది. మ‌రి గ‌తానిక‌న్నా భిన్నంగా సీబీఐ ఇప్పుడు వాన‌ద‌లో వేడి పెంచ‌డం వెనుక వ్యూహం ఏంటి?  అనేక కేసులు ఇర‌వై, ముప్పై ఏళ్ల‌యినా పెండింగులో ఉన్నాయి. వాటిని ప‌ట్టించుకోవ‌డం మానేసి జ‌గ‌న్ కేసునే ప్ర‌త్యేకంగా చూస్తున్నారు.

 

దీనిని బ‌ట్టి.. సీబీఐ వ‌ర్సెస్ జ‌గ‌న్ యుద్ధం భారీ ఎత్తున సాగుతున్న నేప‌థ్యంలో దీనిలో తెర‌చాటున రాజ‌కీయ జోక్యం ఉంటుంద‌ని భావిస్తున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రంలోని బీజేపీ ద‌క్షిణాదిలో పావులు క‌ద‌పాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే, ఈక్ర‌మంలో త‌నంత‌ట తానుగా రంగంలోకి దిగకుండా కేసుల ఉచ్చుల‌తో త‌న వ‌ద్ద‌కే వ‌చ్చేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని ఆ దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను లొంగ దీసుకునే క్ర‌తువులో భాగంగానే ఆయ‌న‌పై సీబీఐని ప్ర‌యోగించింద‌నే వాద‌నా వినిపిస్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: