రాజకీయాల్లో ఎంత పెద్ద పొజిషిన్‌లో ఉన్న సింపుల్‌గా ఉండే నేతలు చాలా తక్కువగా ఉంటారు. తమకు ఎలాంటి పదవి వచ్చిన, పెద్దగా హడావిడి చేయకుండా తమ పని తాము చేసుకెళ్లిపోతారు. ప్రత్యర్ధులు సైతం ఇబ్బందుల్లో ఉన్నారంటే సాయం చేయడంలో కూడా వెనుకాడరు. ఈ విధంగా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సింపుల్‌గా ఉండే నేతల్లో బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు.

 

తండ్రి కోన ప్రభాకర రావు రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కోన రఘుపతి, తండ్రి బాటలోనే కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ బాటలో నడిచి, తర్వాత జగన్‌కు అండగా నిలబడ్డారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బాపట్ల నుంచి బరిలో దిగి, మంచి విజయం అందుకున్నారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోయినా, టీడీపీ పెట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, జగన్ వెనుకే ఉండి ప్రజలకు సేవ చేసుకుని, మళ్ళీ 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు.  

 

ఇక కోన సున్నిత మనస్తత్వంకు తగ్గట్టుగానే జగన్, ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించారు. ఆ పదవిలో హుందాగా ఉంటూనే, సొంత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నారు. నిత్యం ఏదొక విషయంలో ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు.

 

అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే..కోన రఘుపతి తన నియోజకవర్గంలో ఉన్న అందరి ప్రజలకు అండగా ఉంటున్నారు. ముఖ్యంగా ఆయనలో మరో కోణం గురించి చెప్పుకోవాలంటే... ఎన్నికల్లో టీడీపీకి, జనసేనలకు ఓట్లు వేసిన వారికి సైతం సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తున్నారు. పైగా ఈయన రాజకీయం పరంగా టీడీపీపై గానీ, చంద్రబాబుపై గానీ పెద్దగా విమర్శలు చేయరు. అందుకనే టీడీపీ కార్యకర్తలు కూడా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే కోన దగ్గరకు వచ్చేస్తున్నారట. అలాగే ప్రభుత్వ పథకాల అమలులో పార్టీలు అసలు చూడటం లేదు. అంతా తన నియోజకవర్గ ప్రజలే అని అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. మొత్తానికైతే డిప్యూటీ స్పీకర్ బాపట్ల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: