అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో వాణిజ్య ఒప్పందాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న స్వల్ప వాణిజ్య వివాదాలకు ఈ టూర్‌తో చెక్ పెట్టాలని భావిస్తున్నారు. గతంలో అమెరికా నుంచి భారత్ నిరాకరించిన చికెన్ లెగ్ పీస్‌లు, పాల ఉత్పత్తులను కూడా అనుమతించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

 

భారత్-అమెరికా మధ్య సంబంధాలను మరింత మెరుగు పరుచుకునేందుకు ట్రంప్ పర్యటనను అనువుగా మలుచుకోవాలని భావిస్తోంది భారత్. ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు పూర్తి చేశారు అధికారులు. సరైన ప్రతిపాదన వస్తే ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు ట్రంప్‌ ఇప్పటికే ఇచ్చారు. దీంతో గతంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను ఈ సారి ముందుకు తెచ్చే అవకాశం ఉంది.

 

ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా చికెన్ లెగ్‌ పీస్‌లు, పాల ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించడానికి సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. పాల ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మన దేశంలో ప్రస్తుతం దిగుమతులపై పరిమితులు ఉన్నాయి. దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకొని దిగుమతులపై ఆంక్షలు విధించారు. చికెన్‌ లెగ్‌ పీస్‌లపై ఉన్న 100 శాతం సుంకాలను 25 శాతానికి తగ్గించేందుకు భారత్‌ సిద్ధమైనట్లు సమాచారం. అయితే 10 శాతానికి తగ్గించాలని అగ్రరాజ్యం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

 

ప్రాధాన్య వాణిజ్య హోదా ఉన్న దేశాల జాబితా నుంచి భారత్‌ను 2019లో ట్రంప్‌ తొలగించారు.  వైద్య పరికరాలు, డేటా లోకలైజేషన్‌, ఈ-కామర్స్‌పై కొత్త నిబంధనలు రూపొందించిన నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య స్వల్పస్థాయిలో వాణిజ్య విభేదాలు నెలకొన్నాయి. వీటికి స్వస్తి పలికి ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

 

అమెరికా దిగుమతులపై సుంకాల తగ్గింపు సహా మరికొన్ని రాయితీలు కల్పించేందుకు భారత్‌ అంగీకరిస్తే.. భారత్‌కు కొన్ని వస్తువులపై జీఎస్పీ హోదా కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. చైనా తర్వాత అమెరికాకు భారత్‌ రెండో అతిపెద్ద ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామి. 2018లో ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్య విలువ 142.6 బిలియన్‌ డాలర్లు, దీంతో అమెరికాతో వీలైనన్ని ఎక్కువ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని భారత్ భావిస్తోంది.

 

టర్కీ కోళ్లు, బ్లూ బెర్రీలను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ అంగీకరించినట్లు సమాచారం. పాలఉత్పత్తులను సైతం ఐదు శాతం సుంకాలతో అనుమతించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే మాంసాహారాన్ని దాణాగా వేసిన వాటి నుంచి ఆ ఉత్పత్తులు సేకరించొద్దన్న నిబంధన విధించింది. హార్లీ డేవిడ్‌సన్‌ తయారు చేసిన బైక్‌లపై విధించిన 50శాతం టారీఫ్‌లను కూడా తగ్గించేందుకు భారత్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: