మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు.. అదిగో వైసీపీలో చేరిపోతున్నాడు.. జగన్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేసేశాడు.. త్వరలో వైసీపీ మోడీ ప్రభుత్వంలో చేరిపోతుంది. అప్పుడు చిరంజీవికి వైసీపీ కోటాలో మంత్రి పదవి కూడా రెడీ అయ్యింది.. ఇదిగో ఇలాంటి వార్తలు కొన్ని రోజులుగా షికార్లు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం చిరంజీవి కూడా జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలకడం కూడా ఈ ఊహాగానాలకు ఊపిరిపోసింది.

 

మరి ఇంతకీ చిరంజీవి ఏం చేయబోతున్నారు. ఆయన కొన్ని రోజులుగా సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా.. ఇస్తే వైసీపీలోనే చేరుతున్నారా.. ఒకప్పుడు సొంతంగా పార్టీ పెట్టిన చిరంజీవి ఇప్పుడు జగన్ పార్టీలో చేరతారా..కేవలం ఓ ఎంపీ సీటు కోసమో, మంత్రి పదవి కోసమే చిరంజీవి జగన్ చెంతకు చేరతాడా.. ఈ ప్రశ్నలన్నీ చాలామందికి ఉదయిస్తున్నవే.

 

అయితే ఇప్పుడు వీటికి సమాధానం దొరికింది. చిరంజీవికి అత్యంత సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదట. ఇప్పటికే ఒకసారి చేతులు కాల్చుకున్న చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదట. అందులోనూ సినీరంగంలో ఉన్నంత ప్రశాంతత, గౌరవం రాజకీయాల్లో ఉండవని చిరంజీవికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.

 

అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదట. ఇక వైసీపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్న సమాచారం. సో.. ఇక చిరంజీవి సేవలు సినీరంగానికే పరిమితం కానున్నాయి. సినీరంగంలో దాసరి వంటి ఓ పెద్ద లేని లోటు తీరుస్తూ సినీరంగంలోనే కొనసాగాలని చిరంజీవి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సో.. చిరంజీవిని పొలిటికల్ స్టార్ గా చూడాలన్న ఆయన అభిమానుల కోరిక తీరే అవకాశం లేదు. మరోవైపు.. ఆయన సినీరంగంలోనే కొనసాగాలనుకునే ఫ్యాన్స్ కు మాత్రం ఇది పండుగ లాంటి న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: