ఏపీలో వైసీపీ సర్కారుకు కోర్టుల్లో ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై కోర్టులు షాకులు ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని తరలింపు విషయంలో హైకోర్టు ఇటీవల సీరియస్ కామెంట్లు చేసింది. చట్టం రాకుండానే రాజధాని నుంచి కీలకమైన ఆఫీసులు ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. ఇదే పరిస్థితి కొనసాగితే సంబంధింత అధికారుల నుంచి ఖర్చులు జమ చేస్తామని కూడా కామెంట్ చేసింది.

 

ఇక ఇంగ్లీష్ మీడియంపైనా కేసులు నడుస్తున్నాయి. రాజధాని విషయంలోనూ కేసులు కొనసాగుతున్నాయి. సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడంపైనా కోర్టు ఆ మధ్య ఘాటుగా వ్యాఖ్యానించింది. తాజాగా.. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ..అందులో కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

 

ఇలా ఇటీవల జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై కోర్టులు తరచూ స్టేలు ఇవ్వడమో.. సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడమో జరుగుతోంది. ఇదంతా జగన్ సర్కారుకు తలనొప్పిగా మారుతోంది. అయితే జగన్ కు సలహా ఇచ్చేవారు.. ఇలాంటి విషయాల్లో సరిగ్గా పని చేయడం లేదా.. లేక ఉత్తర్వులు జారీలో తగిన న్యాయ సలహాలు తీసుకోవడం లేదా అన్నది అర్థం కాకుండా ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా దూకుడుగా ముందుకు వెళ్తే.. కోర్టుల్లో ఇలాంటి ఇబ్బందులు తప్పవు.

 

ఇలాంటి వరుస దెబ్బల కారణంగా జగన్ సర్కారు ప్రజల్లో ప్రతిష్ట కోల్పోయే అవకాశం ఉంది. అంతే కాకుండా.. ఈ అంశాలన్నీ ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారతాయి. అవకాశం కోసం కాచుకుని కూర్చున్న ప్రతిపక్షానికి ఇవి చక్కని అస్త్రాలుగా మారతాయి. మరి ఇకనైనా జగన్ సర్కారు నిర్ణయాలు తీసుకునే ముందు తగిన కసరత్తు చేస్తుందా లేదా.. అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: