తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఏప్రిల్‌లో ఖాళీ అవబోతున్న రెండు సీట్లను కేసీఆర్‌ ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే పలువురు నేతలు ఇప్పటికే రేసులో తామున్నామంటూ ముందుకొస్తున్నారు. 

 

తెలంగాణ కోటాలోని రెండు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ రెండో వారంలో ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి వందకుపైగా శాసనసభ్యుల బలం ఉంది. రెండు రాజ్యసభ స్థానాలు టిఆర్ఎస్‌కే దక్కుతాయి. షెడ్యూల్‌ విడుదలయ్యే సమయం దగ్గర పడుతుండడంతో గులాబీ పార్టీలో ఆశావహుల ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్‌ను కలిసి తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ అవసరాలు, సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.

 

 రాజ్యసభకు పంపేందుకు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే రాజ్యసభకు వెళ్లేందుకు కవిత ఆసక్తి చూపిస్తుందా.. లేదా అనేది చూడాల్సి ఉంది. పార్టీ సీనియర్ నేత కె.కేశవరావుకు మరోసారి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా తెలియట్లేదు. సీనియర్ నేత కాబట్టి మరో ఛాన్స్ దక్కే అవకాశం ఎక్కువగానే ఉంటుందనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేసిఆర్‌ సన్నిహితుడైన మాజీ స్పీకర్ మదుసుధనాచారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీకి మొదటి స్పీకర్‌గా పనిచేసిన మధు సూదనాచారి  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీ తనకు ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తుందన్న అలోచనతో మధు సూదనా చారి ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి కూడా రాజ్యసభకు తన పేరును పరిశీలించాలని కోరినట్టు సమాచారం.

 

రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మరి పార్టీ అధినేత ఎవరికి ఛాన్స్‌ ఇస్తారో అంతుచిక్కడం లేదు. కొత్తవారికి అవకాశం ఇస్తారా లేక పాతవారినే కొనసాగిస్తారా.. అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: